telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఫోటో కాంటెస్ట్ కోసం ముఖంపై ఆక్టోపస్… తరువాత…!

Octopus

వాషింగ్టన్ లో ఫిషింగ్ డెర్బీ అనే వార్షిక ఫొటో కాంటెస్ట్‌లో పాల్గొన్న జామీ బిస్సెగ్లియా (45) అనే మహిళ ఆ కాంటెస్ట్‌లో మొదటి ప్రైజ్ కొట్టేద్దామని అనుకుంది. ఆ కాంటెస్ట్‌లో పాల్గొనడానికి వచ్చిన యువకుల వద్ద ఓ ఆక్టోపస్‌ను చూసింది. ఆక్టోపస్‌ను ముఖంపై పెట్టుకుని ఫొటో దిగితే… కాంటెస్ట్‌లో గెలవచ్చని అనుకుంది. అలా ముఖంపై ఆక్టోపస్‌ను ఉంచుకుని ఫొటోలు దిగింది. కాసేపు బాగానే అనిపించినప్పటికీ.. ఆ తరువాత జామీకి నరకం కనిపించింది. ఆక్టోపస్ ముఖాన్ని కొరికేస్తుండటంతో జామీకి భయం వేసింది. బలవంతంగా లాగితే చర్మం ఊడి వస్తుందేమో అన్నంతగా ఆక్టోపస్ ఆమె ముఖానికి అతుక్కుపోయింది. అయినప్పటికీ.. నొప్పిని భరించి ఆక్టోపస్‌ను ఎట్టకేలకు ముఖంపై నుంచి లాగింది. వెంటనే ఆమె ముఖంపై పలు భాగాల నుంచి రక్తం రావడం మొదలైంది. దాదాపు అరగంట సేపు రక్తం వస్తూనే ఉందని జామీ తెలిపింది. కాంటెస్ట్ ఉండటంతో జామీ ఆసుపత్రికి కూడా వెళ్లలేదు. అదే తగ్గిపోతుందిలే అని నిర్లక్ష్యం చేస్తూ రాగా.. రెండు రోజుల తరువాత ఆమె ముఖంపై మార్పులు కనిపించాయి. ముఖానికి ఎడమ భాగంలో అసలు స్పర్శ లేకుండా అయిపోయిందని, ఏదైనా తింటే మింగడం కూడా కష్టమైందని జామీ ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లగా.. డాక్టర్ ఈ సమస్య తీరడానికి నెలల సమయం పడుతుందని చెప్పినట్టు పేర్కొంది. ఇప్పటి వరకు కొన్ని వందల టాబ్లెట్లు మింగానని, చిన్న విన్యాసానికి ఇంత పెద్ద శిక్షను అనుభవిస్తున్నానని జామీ చెప్పుకొచ్చింది. తనకు గాయమైన రోజే ఆక్టోపస్‌ను వండుకుని తినేసి కోపాన్ని కూడా తీర్చుకున్నట్టు జామీ చెప్పింది. ఇంత కష్టాన్ని అనుభవించినందుకైనా కాంటెస్ట్‌లో తనకు ఓ బహుమతి వస్తే బాగుండని ఆశపడుతోంది జామీ.

Related posts