telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ట్యూషన్ కు వెళ్లి మరీ.. హిందీ నేర్చుకున్నానంటున్న.. వీవీఎస్‌ లక్ష్మణ్..

vvs lakshman on bangladesh-india series

భారత మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ క్రికెట్‌కు వీడిన తర్వాత కామెంటరీపై ఉన్న ఇష్టంతో వ్యాఖ్యాతగా మారానని అన్నాడు. హిందీలో వ్యాఖ్యాతగా మారడానికి ఎంతో శ్రమించానని, దాని కోసం తన పిల్లలతో కలిసి ట్యూషన్‌కు వెళ్లానని తెలిపాడు. హిందీలో మెరుగవ్వడానికి ఇంకా ప్రయత్నిస్తున్నాను. హిందీ వ్యాఖ్యాతగా మారడానికి ఎంతో కష్టపడ్డాను. పని ఏదైనా దానిపై ఇష్టం పెంచుకోవాలి. ఇప్పుడు కామెంటరీని ప్రేమిస్తున్నాను. ఇంకా క్రికెట్‌లోనే భాగమైనందుకు ఎంతో అదృష్టవంతుడిని. వ్యాఖ్యాతగా అవకాశం ఇచ్చిన స్టార్‌స్పోర్ట్స్‌కు ధన్యవాదాలు. స్టార్‌స్పోర్ట్స్‌ సంజోగ్‌తో నాకు పరిచయం ఉంది. వీక్షకులకు హిందీ భాష ఎంత కీలకమో అతడు నాకు వివరించాడు. అది నాకు స్వతహాగా రాలేదని పేర్కొన్నాడు.

హైదరాబాద్‌లో పెరిగిన నేను హిందీలో మాట్లాడగలను. కానీ హైదరాబాద్‌ హిందీ, కామెంటరీలో వీక్షకులు వినాలనుకునే హిందీ రెండు వేరు. అది నాకు కష్టంగా అనిపించింది. ఆ సమయంలో నాకు రెండే మార్గాలు కనిపించాయి. ఒకటి దాన్ని వదులుకోవాలని, రెండోది కష్టపడి హిందీ నేర్చుకోవాలని. నేను రెండో దాన్ని ఎంచుకున్నాను. ఎందుకంటే హిందీలో అయితే ఎంతో మంది యువకులకు నా జ్ఞానాన్ని, ఆలోచనలను పంచుకోవచ్చు. దీంతో హిందీ నేర్చుకోవడం కోసం ఎంతో శ్రమించాను. మా పిల్లలు హిందీ ట్యూషన్‌కు వెళ్తుంటే వారితో కలిసి వెళ్లి నేర్చుకున్నాను. ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం. ఆరో స్థానంలో బ్యాటింగ్‌లో నాకు పెద్దగా అనుభవం లేదు. కానీ జట్టు కోసం ఆడాల్సి వచ్చినప్పుడు ఓ సవాలుగా తీసుకున్నాను. దాని కోసం శ్రమించాను. ఆ స్థానంలో విజయవంతంగా బ్యాటింగ్‌ చేశాను” అని లక్ష్మణ్‌ తెలిపాడు. వీవీఎస్‌ లక్ష్మణ్‌ టీమిండియాకు ఎన్నో అపూర్వ విజయాలు అందించాడు. భారత్‌ తరఫున 134 టెస్టులు, 86 వన్డేలు ఆడాడు. 2012లో క్రికెట్‌కు రిటైర్మెంట్‌ పలికిన ఈ హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మన్‌ తర్వాత వ్యాఖ్యాతగా మారాడు.

Related posts