telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

3 శాతం పెరిగిన ఓటింగ్.. మాదంటే మాదే అధికారం అంటున్న ప్రధాన పార్టీలు..

AP Assembly contest candidates

నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 80 శాతం పోలింగ్ జరిగింది. అంటే 2014తో పోలిస్తే, సుమారు 3 శాతం వరకూ అధికం. పెరిగిన ఓటింగ్ శాతం తమకు అనుకూలమంటే తమకు అనుకూలమని అధికార తెలుగుదేశం, విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ధీమాగా ఉన్నాయి. ‘పసుపు – కుంకుమ’, పింఛన్ల పెంపు, అమరావతి, పోలవరం తదితరాలు తమకు అనుకూలమని టీడీపీ అంటుంటే, గత ఐదేళ్ల పాలనలో వచ్చిన ప్రజా వ్యతిరేకతే ఓట్ల రూపంలో వెల్లువెత్తిందని వైసీపీ చెబుతున్న పరిస్థితి. ఈ ఎన్నికల్లో విజయం తమదేనని రెండు పార్టీలూ ఘంటాపథంగా చెబుతున్నాయి.

టీడీపీ వర్గాలు పోలింగ్ శాతం పెరగడం, మహిళలు, వయోవృద్ధులు ఉత్సాహంగా ఓటేయడం తమకు లాభిస్తుందని అంటున్నారు. ఇదే సమయంలో పోటీలో నిలబడిన అభ్యర్థులను చూడకుండా, తననే అభ్యర్థిగా భావించి ఓట్లు వేయాలని సీఎం చంద్రబాబు ప్రచారం చివర్లో విజ్ఞప్తి చేయడంపై సానుకూల స్పందన వచ్చిందని టీడీపీ చెబుతోంది.

ఇక ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉన్న కారణంగానే 80 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైందని వైసీపీ చెబుతోంది. తమ అధినేత వైఎస్ జగన్‌ పాదయాత్రతో ప్రజలకు చేరువయ్యారని, ప్రత్యేకహోదా అంశంపై తాము మొదటి నుంచి ఒకే మాటపై ఉన్నామన్న విషయం ప్రజలకు తెలుసునని వైసీపీ చెబుతోంది. బీజేపీతో నాలుగున్నరేళ్లు కలిసుండి, ఎన్నికలకు ముందు టీడీపీ ఆ పార్టీతో విడిపోయిందని, ఈ అంశాలన్నీ తమకు లాభిస్తాయని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.

ఎవరు ఎన్ని అంచనాలు వేసుకున్నా మరో 40రోజులపైనే ఫలితాల కోసం వేచిచూడాల్సి ఉంది. నిన్న చెదురు మొదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, ప్రారంభంలో ఈవీఎం లతో సమస్యలు వచ్చినప్పటికీ కొన్ని ప్రాంతాలలో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిపింది ఎన్నికల సంఘం. దీనితో రీపోలింగ్ కి అవకాశాలు ఉండవనే తెలుస్తుంది. అయితే మే 23 సాయంత్రానికి పీఠం ఎవరిదో తేలిపోతుంది. అప్పటి వరకు వేచిచూడాల్సిందే. ఈ మధ్యలో ఎన్ని సర్వేలు వచ్చినా ప్రజా తీర్పును అంచనా వేయడం మాత్రం ఈ సారి ఎన్నికలలో సాధ్యపడని విషయం అంటున్నారు రాజకీయ నిపుణులు.

Related posts