telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

పనిచేయని ఈవీఎం లు.. అసహనంతో ప్రధాన పార్టీ కార్యకర్తల మధ్య గొడవలు..

evm with candidate photos

నేడు ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఉదయం నుండే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఉన్నారు. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఈవీఎంలు మొరాయించడంతో పలుచోట్ల పోలింగ్ చాలా ఆలస్యంగా మొదలైంది. ఇక కొన్ని చోట్ల ఒక పార్టీకి ఓటు వేస్తె మరో పార్టీకి పడుతుంది.. ఇలా ఈవీఎం లతో పలు సమస్యలు ఎదురవుతుండటంతో క్యూ లో నుంచుని ఉన్న ఓటర్ల నుండి కార్యకర్తల వరకు అసహనంతో గొడవలకు దిగుతున్నారు. దీనితో అక్కడక్కడా చెదురుమొదురు ఘటనలు తప్పట్లేదు. అయితే, అందరి దృష్టీ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటైన మంగళగిరిలో కూడా పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడే చోట్ల మాత్రమే ఈవీఎంలు సరిగ్గా పనిచేయడం లేదని, వీవీ ప్యాట్లలో తాము ఎవరికి ఓటు వేశామో ఓటర్లు చూడలేకపోతున్నారని ఆరోపించిన వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ధర్నాకు దిగారు. ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఆళ్ల ఆరోపించారు. ఈవీఎంలు పనిచేయకున్నా పట్టించుకోవడం లేదన్న అసహనాన్ని వ్యక్తం చేశారు. లోకేశ్ కు మేలు చేసేందుకు ప్రభుత్వ అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఏలూరులో ఓ పోలింగ్ బూత్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. స్థానిక శనివారపుపేట ఇందిరాకాలనీ పోలింగ్ బూత్ వద్ద ఈ ఘటన జరిగింది. పోలింగ్ బూత్ ముందే ఏజంట్ల వద్ద వాగ్వాదం జరుగగా, రెండు పార్టీల వారూ ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఈ దాడుల్లో వైసీపీ కార్యకర్త మట్టా రాజుకు తీవ్రగాయాలు కాగా, ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు స్వల్పగాయాలు అయ్యాయి. పోలీసులు ఇరు వర్గాలవారినీ చెదరగొట్టారు. కాగా, గుంటూరు జిల్లా నరసరావుపేటలోనూ టీడీపీ, వైసీపీ వర్గాల ఏజంట్లూ, కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. పోలీసులు కల్పించుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. భారీ రక్షణ మధ్య పోలింగ్ ప్రారంభించిన జమ్మలమడుగు లో కూడా అదే పరిస్థితి నెలకొంది.

Related posts