ఏపీలో ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజల ఇంటి వద్దకు చేర్చాలనే లక్ష్యంతో గ్రామ, వార్డ్ వాలంటీర్లను నియమించింది. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున గ్రామ, వార్డ్ వాలంటీర్లు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. అధికారులు గ్రామ, వార్డ్ వాలంటీర్లకు విధులకు గైర్హాజరైతే సాలరీ కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు గ్రామ, వార్డ్ వాలంటీర్లు విధులకు గైర్హాజరైతే రోజుకు 166 రూపాయలు కట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. గ్రామ, వార్డ్ వాలంటీర్లుగా ఎంపికైన వారిలో కొందరు విధులకు సరిగ్గా రావడం లేదనే విషయం అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రభుత్వం విధులకు గైర్హాజరైతే సాలరీ కట్ చేయమని చెప్పటంతో అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు.
ఈ నిబంధనతో వాలంటీర్లు విధులకు కరెక్ట్ గా వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం వాలంటీర్ల జాయినింగ్ డేట్ తప్పుగా నమోదై వేతనం చెల్లింపులో అన్యాయం జరిగి ఉంటే సరిచేయాలని అధికారులకు తెలిపింది. ప్రభుత్వం అధికారులకు వాలంటీర్లను తొలగించినా, వాలంటీర్లు ఉద్యోగానికి రాజీనామా చేసినా, వాలంటీర్లు మరణించినా ఎంపీడీవో సీ.ఎఫ్.ఎం.ఎస్ కు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది గ్రామ, వార్డ్ వాలంటీర్లు పని చేస్తున్నారు. ప్రభుత్వం గ్రామ, వార్డ్ వాలంటీర్లకు నెలకు 5 వేల రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తోంది. ప్రజల యొక్క ధరఖాస్తులను గ్రామ, వార్డ్ వాలంటీర్లు పరిశీలించి గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు సేవలందిస్తారు. గ్రామ సచివాలయాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తరువాత గ్రామ వాలంటీర్ల సేవలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయి.