పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై భారత వాయిసేన దళం జరిపిన సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో చిత్రాన్ని చేసేందుకు కొద్ది రోజులుగా సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఓ క్లారిటీ ఇచ్చారు ప్రముఖ నటుడు వివేక్ ఒబేరాయ్. ఫిబ్రవరి 26న పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వాయిసేన యుద్ధ విమానాలతో… ఉగ్ర స్థావరాలపై భీకర దాడులు చేశారు. పాకిస్తాన్ సైతం మనదేశంపై వైమానిక దాడులు చేయడానికి విఫల ప్రయత్నాలు చేసి. చేతులు కాల్చుకుంది. ఈ సందర్భంగా మనదేశ గగనతలంలోనికి చొచ్చుకుని వచ్చిన పాకిస్తాన్ యుద్ధ విమానం ఎఫ్-16ను వెంటాడుతూ వెళ్లిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్… యుద్ధ ఖైదీగా వారికి చిక్కాడు. అయితే అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొగ్గి పాకిస్థాన్ నాలుగురోజుల్లోనే అభినందన్ ను మనదేశానికి క్షేమంగా అప్పగించింది. ఈ సంఘలన్నింటిని వెండితెరపై చూపించేందుకు వివేక్ ఒబేరాయ్ ముందుకు వచ్చారు. ఇందులో అభినందన్ తో పాటు స్క్వాడ్రన్ లీడర్ గా తెర వెనుక సాహసోపేత నిర్ణయాలను తీసుకుంటూ వచ్చిన మింటీ అగర్వాల్ పాత్ర కీలకంగా మారనుంది.
ప్రధాని నరేంద్రమోదీ బయోపిక్‌లో నటించిన వివేక్ ఒబేరాయ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బాలాకోట వెనుక ఉన్న సంఘటనలని ప్రజలకి తెలియజేసేందుకే ఈ సినిమాని తెరకెక్కిస్తామని వివేక్ ఓబెరాయ్ తెలిపారు. ఓ దేశ పౌరుడిగా అది తన బాధ్యత అని ఆయన చెప్పారు. దేశ వైమానిక దళ శక్తి, సామర్థ్యాలు ఏమిటో.. బాలాకోట్ దాడులతో తేటతెల్లమైందని అన్నారు. తాను ఈ సినిమాను కమర్షియల్ పంథాలో తెరకెక్కించబోనని, లాభాలను ఆశించకుండా దేశం గురించి, వైమానిక దళ యుద్ధ శక్తిని దేశ ప్రజలకు కళ్లకు కట్టినట్టుగా తెలియజేయడానికే బాలాకోట్ పేరుతో సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలిపారు. బాలాకోట్ వైమానిక దాడుల పట్ల ప్రతి పౌరుడు గర్వ పడుతున్నారని చెప్పారు. పుల్వామా ఉగ్రవాద దాడులు చోటు చేసుకున్నప్పటి నుంచి బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ వరకు సంభవించిన ప్రతి ఘట్టాన్ని తాను ఆసక్తిగా పరిశీలించానని, ఈ సందర్భంగా కొన్ని రోమాంచక ఘట్టాలు తన దృష్టికి వచ్చాయని వివేక్ ఓబెరాయ్ తెలిపారు. వాటన్నింటినీ తాను ఈ సినిమా ద్వారా దేశ ప్రజలకు తెలియజేస్తానని అన్నారు. ఈ ఏడాదే చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుండగా జమ్ము, ఢిల్లీ, ఆగ్రా పరిసర ప్రాంతాలలో చిత్ర షూటింగ్ జరపనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా స్టోరీకి సంబంధించి తనను, తన సినిమా బృందాన్ని విశ్వసించినందుకు గాను ఐఏఎఫ్‌కు ధన్యవాదాలు చెప్పారు వివేక్. ఈ సినిమాకు సరైన న్యాయం చేస్తామని ఆయన అన్నారు. 2016 సెప్టెంబర్ 18న జమ్ము కశ్మీర్ యురి సెక్టార్ లోని ఆర్మీ స్థావరంపై టెర్రరిస్ట్‌ల ఎటాక్‌కి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ సెప్టెంబర్ 29న సర్జికల్ స్ట్రైక్ జరిపిన సంగతి తెలిసిందే. ఈ సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య దార్ “యురి” అనే సినిమా చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది.