telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తెరపైకి పుల్వామా ఘటన… “బాలాకోట్‌ – ది ట్రూస్టోరీ”

Vivek-Oberoi

ఫిబ్ర‌వ‌రి 26న పుల్వామా దాడికి ప్ర‌తీకారంగా భార‌త వాయిసేన యుద్ధ విమానాల‌తో… ఉగ్ర స్థావ‌రాల‌పై భీక‌ర దాడులు చేశారు. పాకిస్తాన్ సైతం మనదేశంపై వైమానిక దాడులు చేయడానికి విఫల ప్రయత్నాలు చేసి, చేతులు కాల్చుకుంది. ఈ సందర్భంగా మనదేశ గగనతలంలోనికి చొచ్చుకుని వచ్చిన పాకిస్తాన్ యుద్ధ విమానం ఎఫ్-16ను వెంటాడుతూ వెళ్లిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధ‌మాన్… యుద్ధ ఖైదీగా వారికి చిక్కాడు. అయితే అంత‌ర్జాతీయ ఒత్తిళ్ల‌కు లొగ్గి పాకిస్థాన్ నాలుగురోజుల్లోనే అభినందన్ ను మనదేశానికి క్షేమంగా అప్పగించింది. తీవ్రవాద అణచివేతలో కీలకఘట్టంగా బాలాకోట్‌ దాడులు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఆ ఘట్టాల్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. బాలాకోట్‌ వైమానిక దాడుల నేపథ్యంలో “బాలాకోట్‌ – ది ట్రూస్టోరీ” పేరుతో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. పుల్వామాలో భారత జవానులపై దాడి అనంతరం పరిణామాలు, బాలాకోట్‌ ఉదంతంలో వాయిసేన ప్రదర్శించిన అద్వితీయ ధైర్యసాహసాల్ని ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. వివేక్‌ ఒబెరాయ్‌ ఈ సినిమాకు నిర్మాత. ఈ చిత్రంలో వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ ప్రదర్శించిన శౌర్యపరాక్రమాల్ని కూడా చూపించబోతున్నారట. ఈ ఏడాది చివరలో షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జమ్ముకశ్మీర్‌, ఢిల్లీ, ఆగ్రా ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts