బుల్లితెర బిగ్ రియాలిటీ షో సక్సెస్ ఫుల్‌గా పదివారాలు పూర్తి చేసుకొని పదకొండో వారంలోకి అడుగుపెట్టింది. గత వారం రవికృష్ణ బిగ్ బాస్ హౌజ్‌ని వీడగా, ప్రస్తుతం ఇంట్లో తొమ్మిదిమంది సభ్యులు ఉన్నారు. 11వ వారంలో బిగ్ బాస్ ప్రేమజంట రాహుల్, పునర్నవి నామినేషన్‌లో ఉండడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. పదకొండో వారంలో బాటిల్ ఆఫ్ మెడాలియన్ టాస్క్ కొనసాగింది. గత మూడు రోజులుగా బాటిల్ ఆఫ్ మెడాలియన్ టాస్క్ జరుగుతుండగా, 76వ ఎపిసోడ్‌లో మెడాలియన్ టాస్క్ ఫైనల్‌కి చేరుకుంది. ఫైనల్‌లో బాబా భాస్కర్, వితికా పోటీ పడగా వారిద్దరికి రిక్షాలో వీరవిహారం అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో పాల్గొనే పోటీ దారులు కింద కాలు పెట్టకుండా రిక్షాలో ఎంత ఎక్కువ సేపు కూర్చుంటారో వారే విజేతలు అని బిగ్ బాస్ తెలిపారు.
టాస్క్ నియమాల ప్రకారం పోటీదారులకి మిగతా ఇంటి సభ్యులు సపోర్ట్ చేయొచ్చు. నచ్చని పోటీదారుని డిస్టర్బ్ చేయొచ్చు. అయితే, పోటీదారులను రిక్షా నుంచి తోయడం, లాగడం చేయకూడదు. ఇంకో విషయం ఏంటంటే బిగ్ బాస్ సమయానుసారం కొన్ని వస్తువులను పోటీదారులకు పంపిస్తూ ఉంటారు. వాటిని వారిద్దరూ ఏదో విధంగా ఉపయోగించాలి. ఈ టాస్క్‌కి పునర్నవి సంచాలకులుగా వ్యవహరించాలని బిగ్ బాస్ ఆదేశించారు. బిగ్ బాస్ పంపే వస్తువులను పునర్నవి మాత్రమే పోటీదారులకు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. బజర్ మోగగానే రిక్షా ఎక్కిన బాబా బాస్కర్ వితికాలు మొదట్లో కూల్‌గా కనిపించారు. తర్వాత తర్వాత ఇద్దరికి ఆ టాస్క్ ఇబ్బందిగా మారింది. ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూసుకుంటూ కూర్చున్నారు. టాస్క్ జరుగుతుండగా, పోటీ దారులకి స్వెటర్స్ పంపించారు బిగ్ బాస్. ఒక్కొక్కరికి మూడు చొప్పున పంపగా, వాటిని తర్వాతి ఆదేశం వచ్చే వరకు వేసుకొని ఉండాలని అన్నారు. ఇక ఆ తర్వాత ఒక్కొక్క పోటీదారు 10 మిరపకాయల చొప్పున తినాలి అని సూచించారు. బాబా, వితికా ఇద్దరు కష్టంగా మిరపకాయలని తినేశారు. ఆ తర్వాత ఫుల్ బాటిల్ అపీ ఫిజ్ తాగారు . ఇంతలో ఇద్దరికి టాయిలెట్ వస్తుండడంతో ఏం చేయాలని ఆలోచించారు. బాబా భాస్కర్ దుప్పట్లు అడ్డు పెట్టుకొని పని కానిచ్చే ప్రయత్నం చేశాడు. ఇది నచ్చని వితికా ఆయనని రిక్షా నుండి కిందకి తోసేసింది. బాబా భాస్కర్ కాలు కింద పెట్టిన కారణంగా వితికాని విజేతగా ప్రకటిస్తూ మెడాలియన్ అందుకునే సమయం ఆసన్నమైందని తెలిపారు బిగ్ బాస్.