విశాఖ ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాంకీ ఫార్మాసిటీలోని ‘విశాఖ సాల్వెంట్స్’ లో గత అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇవి రసాయన డ్రమ్ములకు అంటుకోవడంతో భారీ శబ్దంతో పేలిపోయాయి. దాదాపు పది కిలోమీటర్ల వరకు పేలుడు శబ్దాలు వినిపించడంతో పరిసర ప్రాంత ప్రజలు వణికిపోయారు.
మంటల తీవ్రతకు ఫార్మా సిటీకి సమీపంలోని హెచ్‌టీ విద్యుత్ లైన్లు కూడా తెగి కిందపడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులు బయటకు వచ్చి భయంతో పరుగులు తీశారు. ఆ ప్రాంతమంతా నల్లని పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. ప్రమాదంలో ఒక వ్యక్తి గాయపడడం మినహా ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
50 అడుగుల ఎత్తు వరకు ఎగసిపడుతున్న మంటలను చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పేలుడు సమాచారం అందుకున్న వెంటనే విశాఖ, అనకాపల్లి నుంచి 12 భారీ అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే, మంటల వేడికి కంపెనీ వద్దకు చేరుకునేందుకు సిబ్బంది ఇబ్బంది పడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు కంపెనీలో నలుగురు మాత్రమే పనిచేస్తుండడంతో పెను ప్రమాదం తప్పింది.
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై దత్తాత్రేయ ఫైర్