telugu navyamedia
క్రీడలు వార్తలు

థర్డ్ అంపైర్ ను ఆట ఆడుకుంటున్న నెటిజన్లు…

ఇంగ్లాండ్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ 31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57తో రాణించడంతో నాలుగో టీ20లో టీమిండియా అద్భుత విజయాన్నందుకుంది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసి రేసులో నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఔటైన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. సామ్ కరన్ వేసిన 14 ఓవర్ తొలి బంతిని తనదైన రివర్స్ స్వీప్ షాట్‌తో భారీ సిక్సర్ కొట్టిన సూర్య.. ఆ మరుసటి బంతిని కూడా అదే రీతిలో షాట్ ఆడగా.. ఫైన్ లెగ్‌లో ఉన్న డేవిడ్ మలన్ చేతిలో పడింది. అయితే అతను క్యాచ్ పట్టే క్రమంలో బంతి నేలకు తాకినట్లు అనిపించడంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు. పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్ అంపైర్.. బంతి నేలకు తాకినట్లు స్పష్టమైన ఆధారం లేదని, నిబంధనల మేరకు తాను ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన సాప్ట్ సిగ్నల్‌కు కట్టుబడి ఔటిస్తున్నానని తెలిపాడు. అయితే నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అయితే థర్డ్ అంపైర్ కళ్లకు గంతలు కట్టుకొని మరి ఈ నిర్ణయం తీసుకున్నాడనే మీమ్‌ను ట్వీట్ చేశాడు. అంత స్పష్టంగా బంతి నేలకు తాకినట్లు కనబడుతుంటే ఆధారం లేదని థర్డ్ అంపైర్ ఎలా ఔటిస్తాడని వీవీఎస్ లక్ష్మణ్ ప్రశ్నించాడు. మాజీ క్రికెటర్లు వసీం జాఫర్, సంజయ్ మంజ్రేకర్, ఆకాశ్ చోప్రాలు సైతం థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. బంతి నేలను తాకుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నా అవుట్‌గా ప్రకటించాడంటే, థర్డ్ అంపైర్ కళ్లకి ఆపరేషన్ చేయించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related posts