telugu navyamedia
క్రీడలు వార్తలు

కోహ్లీకి వార్నింగ్ ఇచ్చిన మ్యాచ్ రిఫరీ…

నిన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ మందలింపునకు గురయ్యాడు. ఐపీఎల్‌ నియమావళిని ఉల్లంఘించడమే ఇందుకు కారణం. టాస్‌ ఓడి ఇన్నింగ్స్‌ ఆరంభించిన బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. కరోనా నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన యువ ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ (11) ఆరంభంలోనే ఔట్‌ కాగా.. పించ్‌ హిట్టర్‌గా వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన షాబాజ్‌ అహ్మద్‌ (14) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. ఈ దశలో కోహ్లీకి గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ తోడవడంతో బెంగళూరు ఇన్నింగ్స్‌ సజావుగా సాగింది. అయితే హైదరాబాద్‌ స్పిన్నర్లు విజృంభించడంతో వేగంగా పరుగులు రాలేకపోయాయి. స్కోరు వేగం పెంచే క్రమంలో జేసన్ హోల్డర్‌ వేసిన 12.1వ బంతిని విరాట్ కోహ్లీ భారీ షాట్‌ ఆడాడు. బ్యాటు అంచుకు తగిలిన బంతి గాల్లోకి లేచింది. లాంగ్‌ లెగ్‌లో ఉన్న ఫీల్డర్‌ విజయ్‌ శంకర్‌ వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి.. డైవ్‌ చేసి ఆ క్యాచ్‌ను అద్భుతంగా ఒడిసిపట్టాడు. ఔటైన ఆవేశంలో డగౌట్‌కు చేరుకునే క్రమంలో కోహ్లీ.. అడ్వర్టైజ్‌మెంట్‌ కుషన్ (బౌండరీ లైన్)‌, కుర్చీని తన్నేశాడు. అతడు ఐపీఎల్‌ నియమావళిలోని లెవల్‌ 1, 2.2 నిబంధనలను ఉల్లంఘించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. దాంతో రిఫరీ వెంగలిల్‌ నారాయణ్‌ కుట్టీ.. కోహ్లీని మందలించాడు.

Related posts