భారత క్రికెటర్ విరాట్ కోహ్లి అత్యధిక టెస్టు విజయాలు అందించిన సారథిగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకోడానికి ఒక్క విజయం దూరంలో ఉన్నాడు. 27 మ్యాచ్‌లు గెలిచి ధోనీ సరసన నిలిచిన కోహ్లి మరో విజయం సాధిస్తే అతని రికార్డు బద్దలవుతుంది. ధోని 60 టెస్టుల్లో 27 మ్యాచ్‌లు గెలిపించగా, 15 మ్యాచ్‌లు డ్రా కాగా, 18 మ్యాచ్‌ల్లో జట్టు ఓడిపోయింది. కోహ్లి సారథ్యంలో 47 టెస్టుల్లో 27 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 10 మ్యాచ్‌లు డ్రా కాగా, 10 మ్యాచ్‌లు ఓడిపోయింది.
కెప్టెన్‌గా విదేశాల్లో అత్యధిక విజయాలు సాధించిన కోహ్లి రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు గంగూలీ పేరిట ఉంది. గంగూలీ 28 మ్యాచ్‌ల్లో 11 విజయాలు సాధించగా, కోహ్లి 26 మ్యాచ్‌ల్లోనే 12 విజయాలు సాధించి రికార్డు సృష్టించాడు. కాగా, రేపు విండీస్‌తో జమైకాలోని సబీనాపార్క్‌లో జరగబోయే రెండో టెస్టులో ఇండియా విజయం సాధిస్తే ధోని రికార్డు సైతం కోహ్లి వశమవుతుంది.