telugu navyamedia
రాజకీయ వార్తలు

భారత్ బంద్ .. బెంగాల్ లో హింసాత్మక ఘటనలు..

violence in barat band in west bengal

నేడు కార్మిక సంఘాల భారత్‌ బంద్‌ పిలుపుతో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో బుధవారం హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మాల్ధా జిల్లా సుజాపూర్‌ ప్రాంతంలో ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పాటు రెండు పోలీసు వాహనాలకు నిప్పంటించారు. జాతీయ రహదారి 34ను నిర్బంధించడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు లాఠీచార్జి చేసినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో గాలిలోకి కాల్పులు జరపడంతో పాటు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. గత నెలరోజులుగా సీఏఏపై నిరసనలతో మాల్దా జిల్లా అట్టుడుకింది. రైల్వే స్టేషన్లు, రైళ్లు, బస్సులకు ఆందోళనకారులు నిప్పంటించడంతో ఉద్రిక్తతలు తలెత్తిన క్రమంలో భారత్‌ బంద్‌ నేపథ్యంలో ముమ్మరంగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

పోలీస్ యూనిఫాంలో ఉన్న ఓ వ్యక్తి వాహనం అద్దాలు పగులగొడుతున్న వీడియోను చూపిస్తూ పోలీసులే దాడులకు పాల్పడి తమపై నింద మోపుతున్నారని సుజాపూర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇషా ఖాన్‌ చౌదరి ఆరోపించారు. ప్రశాంతంగా సమ్మెలో పాల్గొన్న తమపై ఖాకీలు ప్రతాపం చూపారని మాల్ధా జిల్లా సీపీఎం కార్యదర్శి అంబర్‌ మిత్రా ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు లెఫ్ట్‌ పార్టీలు భారత్‌ బంద్‌కు పిలుపు ఇవ్వడాన్ని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వ్యతిరేకించారు. వామపక్షాల బంద్‌ పిలుపును చౌకబారు రాజకీయ ఎత్తుగడగా ఆమె అభివర్ణించారు. బంద్‌ సందర్భంగా హింసకు పాల్పడితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆమె హెచ్చరించారు.

Related posts