telugu navyamedia
సినిమా వార్తలు

“వినయ విధేయ రామ” మా వ్యూ

vinaya vidheya rama movie juke box
బ్యానర్ : డీవీవీ ఎంటర్టైన్మెంట్ 
నటీనటులు : రామ్ చరణ్, కైరా అద్వానీ, ఈషా గుప్తా, స్నేహ తదితరులు  
దర్శకుడు : బోయపాటి శ్రీను 
నిర్మాత : డీవీవీ దానయ్య 
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ 
రంగస్థలం వంటి విభిన్నమైన సినిమాతో తన క్రేజ్ ను అమాంతం పెంచేసుకున్న రామ్ చరణ్… తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “వినయ విధేయ రామ”. సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే సినిమా పేరుకు, ట్రైలర్ కు ఏమాత్రం సింక్ కాలేదు. మరోవైపు ఈ సినిమా గ్యాంగ్ లీడర్ కథ అంటూ ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి బరిలో భారీ పోటీ ఉన్నప్పటికీ వెనక్కు తగ్గకుండా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రేక్షకులకు టైటిల్ కు సరిపోయే సినిమానే అనిపించిందా ? సంక్రాంతి బరిలో హిట్ సినిమాగా నిలుస్తుందా ? అనేది చూద్దాం. 
కథ :
ఐదుగురు అన్నదమ్ములు (ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, మధునందన్, రవివర్మ, రామ్ చరణ్). అందమైన కుటుంబం… అందరికన్నా చిన్నవాడు రామ్ కొణిదెల (రామ్ చరణ్)… రామ్ అంటే కుటుంబంలోని చిన్నాపెద్దా అందరికి ఇష్టమే. రామ్ కు కూడా తన కుటుంబం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఎలాంటి గొడవ తలెత్తినా… గొడవకు కారణమైన వారిని రామ్ చావగొడతాడు. రామ్ పెద్దన్నయ్య (ప్రశాంత్) విశాఖ ఎలక్షన్ కమిషనర్ గా పని చేస్తుంటారు. అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో పందెం పరశురామ్ (ముఖేష్ రుషి) అరాచకాలను బయటపెడతాడు రామ్ పెద్దన్నయ్య. ఈ గొడవ వల్ల పరశురామ్ రామ్ కుటుంబాన్ని టార్గెట్ చేసి చంపెయ్యడానికి ప్లాన్ చేస్తాడు. అందుకోసం ప్రత్యేకంగా బీహార్ లో ఉన్న మున్నాభాయ్ (వివేక్ ఒబెరాయ్)ను దింపుతాడు. మరి మున్నాభాయ్ రామ్ కుటుంబాన్ని ఏం చేశాడు ? అతని వల్ల రామ్ కుటుంబం ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది ? ఈ సమస్యలను, మున్నాభాయ్ ని రామ్ ఎలా ఎదుర్కొన్నాడు ? అనేది వెండి తెరపై వీక్షించాల్సిందే.
నటీనటుల పనితీరు :
ఈ సినిమాలో రామ్ పాత్ర‌లో చాలా షేడ్స్ కన్పిస్తాయి. ఫ్యామిలీ, లవర్, ఫ‌న్‌, ఒక ఫైట‌ర్ ఇలా వివిధ కోణాల్లో కన్పిస్తాడు రామ్ చరణ్. అయితే ఎక్కువగా ఫైట‌ర్ మాత్ర‌మే కన్పిస్తాడు. సిక్స్‌ప్యాక్ చేసి రామ్ చేసిన యాక్ష‌న్ స‌న్నివేశాలు అభిమానుల‌ను బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రామ్ చరణ్ డ్యాన్స్ ప్రేక్షకులను అలరిస్తుంది. కైరా అద్వానీ పాత్రకు అంతగా ప్రాధాన్యం లేదు. కానీ ఆమె తెరపై అందంగా క‌నిపించింది. అన్న‌ద‌మ్ములుగా న‌టించిన ప్ర‌శాంత్‌, ఆర్య‌న్‌ రాజేష్‌, మ‌ధునంద‌న్‌, ర‌వివ‌ర్మ‌ తమ పాత్ర‌ల‌తో ఆకట్టుకుంటారు. విలన్ పాత్ర‌లో న‌టించిన వివేక్ ఒబెరాయ్ ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులు తమ పరిధిమేర నటించారు. 
సాంకేతికవర్గం పనితీరు :
బోయపాటి తన మార్క్ మేకింగ్ చూపించాడు. అయితే సినిమా మొత్తాన్ని ఫైట్ల చుట్టూ అల్లుకున్నాడేమో అన్పిస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నా… కథలో బలం లేకపోవడం సినిమాకు మైనస్. ప్రథమార్థం సరదా సన్నివేశాలతో బాగానే సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ద్వితీయార్థంలో భారీ ఫైట్… మరీ హింస ఎక్కువైందేమో అన్పిస్తుంది. మాస్ ప్రేక్షకులను సినిమా బాగానే ఆకట్టుకుంటుంది. దేవిశ్రీ పాటలు ఫరవాలేదన్పించాయి. నేపథ్య సంగీతం బాగుంది. కెమెరా వర్క్, ఎడిటింగ్ సినిమాకు కలిసొచ్చే అంశాలు. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
రేటింగ్ : 2.5/5

Related posts