telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దుబాయ్ చేలో.. త్వరలో… విజయవాడ నుండే..

foundation to kadapa steel plant today by apcm

ఇటీవల కొత్త రాష్ట్రం ఏపీ రాజధాని అమరావతి రూపుదిద్దుకుంటున్న తరుణంలోనే, విజయవాడ నుండి సింగపూర్ కు విమానసేవలను ప్రారంభించారు. దానికి స్పందన కూడా చాలా బాగానే ఉంది. అలాగే ఇప్పుడు ప్రజలవద్ద నుండి అనేక విజ్ఞప్తుల నేపథ్యంలో విజయవాడ నుండి దుబాయ్ కి కూడా విమాన సేవలను ప్రారంభించేందుకు సన్నద్దమ వుతుంది కొత్తరాష్ట్రం. ఈ ప్రక్రియ కూడా ఊపందుకుంది. మరో నెల రోజుల్లో దుబాయి సర్వీసు ప్రారంభమయ్యే అవకాశం కన్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ(ఏపీఏడీసీఎల్‌) ఆధ్వర్యంలో బిడ్లను ఆహ్వానిస్తూ జనవరి 23న నోటిఫికేషన్‌ను విడుదల చేసి ఫిబ్రవరి 02 వరకూ స్వీకరించారు. అతి తక్కువకు బిడ్‌ను దాఖలు చేసిన విమానయాన సంస్థకు అవకాశం కల్పించనున్నారు. ఫిబ్రవరి 11న విమానయాన సంస్థల ప్రతినిధుల సమక్షంలోనే బిడ్లను తెరిచి తక్కువకు కోట్‌ చేసిన సంస్థను ఎంపిక చేస్తారు. అనంతరం నెల రోజుల వ్యవధిలో ఈ సర్వీసు ఆరంభమయ్యే అవకాశం ఉంది. గతంలో సింగపూర్‌కు సర్వీసును నడిపినప్పుడు కూడా ఇలాగే తొలుత బిడ్లను ఆహ్వానించి అనంతరం ఇండిగోను ఎంపిక చేశారు. దుబాయికి సర్వీసును ఏర్పాటు చేస్తే.. సింగపూర్‌ కంటే రద్దీ రెట్టింపు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ సేవల గురించి ప్రజాభిప్రాయ సేకరణను కూడా ఏపీఏడీసీఎల్‌ చేపట్టింది. గతంలో సింగపూర్‌కు సర్వీసును ఆరంభించే ముందు కూడా ఇలాగే సర్వే చేపట్టారు. తాజాగా దుబాయికి నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు మంచి స్పందన వచ్చింది. ఏపీఏడీసీఎల్‌ వెబ్‌సైట్తో పాటూ ఈమెయిల్‌, వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా సర్వేను చేపట్టారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు విదేశాలలో ఉండే ప్రవాసాంధ్రుల నుంచి మద్దతుగా పెద్దఎత్తున స్పందన వచ్చింది. ఏపీఏడీసీఎల్‌ వెబ్‌సైట్‌లోనే 2,42,594 మంది దుబాయి సర్వీసుకు ఓటేశారు. 950 మంది ఈమెయిళ్ల ద్వారా తమ సమ్మతిని తెలిపారు. మరో 25 మంది వాట్సాప్‌, 30 మంది ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఆసక్తిని తెలియజేశారు. 

దుబాయి సర్వీసును బుధ, శుక్రవారాల్లో వారంలో రెండు రోజులు నడపాలని భావిస్తున్నారు. ప్రస్తుతం సింగపూర్‌కు నడుస్తున్న అంతర్జాతీయ సర్వీసులు మంగళ, గురువారాల్లో గన్నవరం నుంచి నడుస్తున్నాయి. అందుకే.. బుధ, శుక్రవారాల్లో నడపాలని భావిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి దుబాయికి సర్వీసును ఆరంభిస్తే.. స్పందన భారీగా ఉండబోతోంది. గన్నవరం నుంచి దుబాయి సర్వీసును ఆరంభించాలంటూ ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఫెడరేషన్‌ తరఫున చాలాకాలంగా కోరుతున్నామని, ఇన్నాళ్లకు ఆ కల నెరవేరుతుండటంతో ఈ ప్రాంత వాసులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతోందన్నారు.

Related posts