telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రైవేట్‌ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం సాయం…వ్యతిరేకించిన రాములమ్మ !

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న ప్రైవేట్ టీచర్లను, సిబ్బందిని ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి . విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి నెలకు రూ. 2000 నగదు సాయంతో పాటు కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.  అయితే.. ఈ నిర్ణయంపై రాములమ్మ ఫైర్‌ అయ్యారు. అసలు ఒక ఇల్లు గడివడానికి రూ.2 వేలు సరిపోతాయా ? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. “తెలంగాణలో గత ఆరేడు నెలలుగా ప్రయివేటు టీచర్ల జీవితం అత్యంత దారుణంగా దిగజారిపోయింది. వరుస ఆత్మహత్యలు, పాలకుల పట్టింపులేనితనంపై తీవ్ర విమర్శల నేపథ్యంలో ఏదో తూతూ మంత్రంగా రాష్ట్ర సర్కారు వారికి రూ.2 వేలు డబ్బు, 25 కిలోల బియ్యం సాయంగా ప్రకటించింది. కరోనా పరిస్థితుల వల్ల కిందటేడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకూ 30 మంది ప్రయివేటు టీచర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరెందరో ఉద్యోగాలు కోల్పోయి నేటికీ బండ్లు నడుపుకుంటూ, కూరలమ్ముకుంటూ, కూలీలుగా ఇలా బతుకు గడవడానికి ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాల మార్గాలు వెదుక్కుంటున్నారు. ఈ పరిస్థితులపై మీడియాలో మొదటి నుంచీ ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. అప్పుడే సర్కారు మేల్కొని వారికి అండగా పాలకులు ఉన్నారనే భరోసా కాస్తయినా ఇచ్చి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవి కాదు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మీరిచ్చే 2 వేలు ఆ కుటుంబాలకు ఏమూలకు సరిపోతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వ టీచర్లయినా, ప్రయివేటు టీచర్లయినా సమాజంలో గురువు స్థానం ఎప్పటికీ ఉన్నతమైనదేనని ముందుగా ప్రభుత్వం గుర్తించాలి. కేవలం కాస్త డబ్బు, బియ్యం ఇస్తే వారి కన్నీరు ఆగదు. టీచర్లు గౌరవప్రదంగా జీవించే పరిస్థితులు కల్పించినప్పుడే వారికి నిజమైన సంతృప్తి. సర్కారు ఈ దిశగా ప్రయత్నించాలి.” అంటూ విజయశాంతి పేర్కొన్నారు. 

Related posts