తెలంగాణలో జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి స్పందించారు. ఈ ఫలితాలు అధికార టీఆర్‌ఎస్ పార్టీ నియంతృత్వ పోకడకు చెంప పెట్టులా మారాయని విజయశాంతి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ దయతో, ఈవీఎమ్‌ల గోల్‌మాల్‌తో కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యారని ఆమె ఆరోపించారు. రెండోసారి సీఎం అయిన వెంటనే కేసీఆర్ పాలన పై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే పనిలో పడ్డారని అన్నారు.
కేసీఆర్ కుట్రలను తిప్పి కొట్టే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు తమ తీర్పునిచ్చారని ఆమె అభిప్రాయపడ్డారు. మరోవైపు టీఆర్‌ఎస్‌కి 16 ఎంపీ సీట్లను కట్టబెడితే కేసీఆర్ ప్రధాని అవుతారన్న భయం విద్యావంతుల్లో కలిగిందని, అందుకే వారు టీఆర్‌ఎస్‌ని ఓడించారని ఆమె ఎద్దేవా చేశారు. ఈ ఫలితాలు కేసీఆర్‌కి కనువిప్పు కలిగించక పోయినా, కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు ఆత్మశోధన చేసుకుంటారని తాను భావిస్తున్నానని విజయశాంతి అభిప్రాయపడ్డారు.