telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బార్లు, పబ్‌ల వాళ్ళకు రూ.2 వేలు ఇవ్వండి : రాములమ్మ డిమాండ్

తెలంగాణ సర్కార్ పై మరోసారి బిజేపి నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. తెలంగాణ సర్కారంటే గత్తర బిత్తర గందరగోళానికి మారుపేరు అని మండిపడ్డారు. “తెలంగాణ సర్కారంటే గత్తర బిత్తర గందరగోళానికి మారుపేరు అని సీఎం కేసీఆర్ గారు పదేపదే నిరూపిస్తున్నారు. రాష్ట్రాన్ని దాదాపు నెలన్నరగా కోవిడ్ సెకెండ్ వేవ్ తీవ్రస్థాయిలో వేధిస్తుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఇప్పుడు ఒక ప్రణాళిక లేకుండా ఆదరాబాదరాగా ఏం తోస్తే అది చేస్తున్నారు. వరంగల్, అదిలాబాద్ జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రారంభం… సిబ్బంది నియామకం అంటూ ఆదేశాలిచ్చారు. పీఎంఎస్ఎస్‌వై కింద ఎంజిఎంలోను, రిమ్స్‌లో నిర్మించే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి తెలంగాణ వాటాగా ఇవ్వాల్సిన రూ.28 కోట్లు తక్షణం విడుదల చేయాలని ఆజ్ఞాపించారు. ప్రజారోగ్యం పట్ల సీఎం గారికి అంత శ్రద్ధ ఉంటే… కరోనా పీడిస్తున్న గత ఏడాది కాలంలోనే ఈ పనులు ఎందుకు చెయ్యలేదు? రాజకీయాలు పక్కనపెట్టి ఈ ప్రారంభోత్సవాలు, నియామకాలు, నిధుల విడుదల కాస్త ముందుగానే చేసి ఉంటే ఇంత అయోమయం, కోర్టులతో మందలింపులు ఉండేవి కాదు కదా? మరోవైపు ఫలితంలేని నైట్ కర్ఫ్యూ మాత్రం పెట్టి పగటివేళ నియంత్రణ లేకుండా గాలికి వదిలేశారు. కోవిడ్ వ్యాప్తిలో అత్యంత ప్రమాదకరమైన బార్లు, పబ్‌లు, సినిమాహాళ్ళు, సభలు, సమావేశాలు తదితరాల విషయాన్ని పక్కనపడేసి కేవలం విద్యాసంస్థల్ని మాత్రమే మూయించి ఉపాధ్యాయులు రోడ్డున పడేలా చేశారు. ఇప్పుడు వీరికిస్తున్న పాతిక కేజీల బియ్యం… రూ.2 వేల ఆర్థిక సహాయాన్ని బార్లు, పబ్‌ల, సినిమాహాళ్ళ వారికి అందించి వాటిని మూయించి ఉన్నా…. లేదా ఇప్పటికైనా మూయిస్తే ఇన్ని ప్రాణాలు ప్రమాదం ముంగిట ఉండేవి కావేమో…” అంటూ విజయశాంతి పేర్కొన్నారు.

 

Related posts