తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి అధికార టీఆర్ఎస్ పార్టీ పై మరోసారి ఫైర్ అయింది. “దుబ్బాక ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ సర్వ విధాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల కోడ్ రావడానికి ముందే టీఆర్ఎస్ ఆ నియోజకవర్గంలో గెలుపు కోసం అనేక దుష్ప్రయోగాలు ప్రారంభించింది. గత కొన్నిరోజులుగా మరింత బరితెగించేందుకు అధికార పార్టీ సిద్ధపడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆ ఎన్నిక జరపడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరమా కాదా అన్న సందేహాలు కూడా సమాజంలో వ్యక్తమవుతున్నాయి.” అంటూ ఫైర్ అయింది విజయశాంతి. కాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానం కోసం ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్ అక్టోబరు 9న వెలువడింది. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ కూడా ముగిసింది. ఈ ఉప ఎన్నిక నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి.. అదే నెల 10న ఫలితాలు విడుదల చేయనుంది. ప్రస్తుతం బరిలో 23 మంది అభ్యర్థులు ఉన్నారు.