telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆత్మ రక్షణలో కాంగ్రెస్… బీజేపీ గూటికి విజయశాంతి?

మూలిగే నక్క పై తాటి పండు పడ్డ చందం గా తయారైంది రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి. దుబ్బాక ఉపఎన్నిక పార్టీ పరిస్థితిని మారుస్తుందనుకుంటున్న నేపథ్యంలో, ఇది కాస్తా బెడిసికొట్టి పెనం నుండి పొయ్యి లో పడ్డట్లుగా మారింది కాంగ్రెస్ ముఖచిత్రం. రానున్న రోజుల్లో పార్టీ పరిస్థితి మరింత దిగజారే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. పార్టీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్, సినీ నటి విజయశాంతి కాంగ్రెస్ ను వీడి బీజేపీ చెంత చేరనున్నారనే వార్త ఇటీవలికాలంలో కాంగ్రెస్ నాయకత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వాదనకు బలం చేకూర్చే విధంగా…విజయశాంతిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి తో పాటుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ లు వేర్వేరుగా కలిసి చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే విజయశాంతి బీజేపీలో చేరడం దాదాపుగా ఖాయమనే చెప్పవచ్చు.

వికటించిన కాంగ్రెస్ రాయబారం:
విజయశాంతి బీజేపీ ముఖ్యనాయకులతో రాయభారాలు జరుపుతున్నారనే విషయం తెలియగానే అలెర్ట్ అయిన కాంగ్రెస్ అధిష్టానం…టీపీసీసీ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ్ కుమార్ ను ఆమె వద్దకు దూతగా పంపింది. కానీ, విజయశాంతి మాత్రం కాంగ్రెస్ ముఖ్య నాయకుల వ్యవ హార శైలి పై విరుచుకుపడినట్లు తెలిసింది. తనతో పాటుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరీ ఎంపీ ఎ. రేవంత్ రెడ్డికి పార్టీలో సరైన ప్రాధ్యాన్యత కల్పించడంలేదంటూ విరుచుకుపడినట్లు తెలిసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ ను కాపాడటం కష్టతరమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పినట్లు సమాచారం.

విజయశాంతి పై బీజేపీ ప్రశంసల వర్షం:
ఇదిలాఉండగా, మరోవైపు బీజేపీ ముఖ్య నాయకులు విజయశాంతిపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. ఆమె చరిష్మా ఉన్న గొప్ప నాయకురాలని, తెలంగాణకోసం కష్టపడి పనిచేసినప్పటికీ…సీఎం కెసిఆర్ ఆమెను మోసంచేశారని అన్నారు . కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతిని బీజేపీ ముఖ్యనాయకుడు బహిరంగ వేదికల్లోనే పొగడడాన్ని గమనిస్తే ఆమె బీజేపీలో చేరికపై పార్టీ అధిష్టానం పరోక్షంగా స్పష్టమైన సంకేతాలిచ్చినట్లైంది.

దుబ్బాక ఫలితాలకు ముందే ఓటమిని అంగీకరించిన కాంగ్రెస్?:
టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఓటమిని ఫలితాలకంటే ముందే ఒప్పుకున్నట్లుగా స్పష్టమవుతోంది . ముఖ్యంగా పోలింగ్ కు ముందు రెండు న్యూస్ ఛానల్ ల లోగోలతో సోషల్ మీడియాలో శ్రీనివాస్ రెడ్డి తెరాస లోకి జంప్ అవుతున్నట్లు జరిగిన ప్రచారంలో తెరాస, బీజేపీ ల కుట్ర ఉందని, ఇది తమ పార్టీ అభ్యర్థి కి నష్టం చేసిందని ఉత్తమ్ ఆరోపించారు. దీన్ని ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా పరిగణించి, గెలిచిన అభ్యర్థిపై వేటు వెయ్యాలని ఉత్తమ్ కోరడం గమనార్హం. ఈ విషయాలన్నింటిని పరిశీలిస్తే కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆత్మరక్షణలో పడిందనడంలో ఎలాంటి సందేహం లేదు, దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరింత చతికిల పడే పరిస్థితులు స్పష్టమవుతున్నాయి.

Related posts