telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సీఎం కేసీఆర్‌ను రోమ్‌ చక్రవర్తితో పోల్చిన విజయశాంతి !

తెలంగాణ సీఎం కేసీఆర్‌, హోంమంత్రి మహమూద్ అలీలపై బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేశాననేది బహింరంగా ప్రకటించిన హోంమంత్రి మహమూద్ అలీ తీరుపై రాములమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొన్న తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ గారు తాను ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేశాననేది బహిరంగంగా ప్రకటించారు. ఎన్నికల నియమావళిని కాలరాసిన హోంమంత్రి ఓటు చెల్లదు. కానీ, ఆయనపై నిన్న ఎవరూ ఫిర్యాదు చెయ్యలేదని…. ఆర్వో ఫిర్యాదు అందిన వెంటనే ఓటుపై పరిశీలిస్తామని అధికారులు అన్నారు. హోంమంత్రి ఎవరికి ఓటేశారో స్వయంగా ఆయనే నిబంధనలకు విరుద్ధంగా మీడియా వద్ద బహిరంగంగా చెప్పిన తర్వాత… వెంటనే చర్య తీసుకోకుండా ఫిర్యాదు కోసం ఎదురు చూడటం ఏంటో అర్థం కావడం లేదు. లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేల ఎన్నికలకు వ్యయపరిమితిని విధించిన ఎన్నికల సంఘం… ఎమ్మెల్సీల విషయంలో అలాంటిదేమీ పెట్టకపోవడంతో టీఆరెస్ పార్టీ విచ్చల విడిగా కోట్లాది రూపాయల ధనాన్ని ప్రకటనలు, ప్రచారం కోసం… ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఖర్చు చేసింది. రాజ్యాంగ వ్యవస్థలంటే తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రివర్యులకు ఏ మాత్రం పట్టదు. పాలనను గాలికొదిలేసిన సర్కారు ఇది. పదే పదే హింసకు గురవుతున్న భైంసా పట్టణమే ఇందుకు అతి పెద్ద ఉదాహరణ. పలుమార్లు శాంతి భద్రతలు ప్రశ్నార్థకంగా మారి, లూటీలు, దాడులు, హత్యలు యథేచ్ఛగా జరుగుతూ భైంసా ప్రజలు బిక్కుబిక్కుమని బతుకుతుంటే…. రోమ్ నగరం తగలబడుతున్నప్పుడు ఫిడేలు వాయించిన నీరోను గుర్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్ గారు.” అంటూ విజయశాంతి ఫైర్‌ అయ్యారు.

Related posts