telugu navyamedia
రాజకీయ సినిమా వార్తలు

విజయ శాంతి రాజకీయ జీవితం ముగిసిపోయిందా ?

Vijaya 1

ఇవ్వాళ విజయ శాంతి 53వ జన్మదినం.13 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత మళ్ళీ సినిమాల్లో నటిస్తుంది. విజయ శాంతి జీవన ప్రస్థానం గురించి తెలుసుకుందాం.

Vijayashanthi-with-Rahul-Gandhi

 

దక్షిణ భారతంలో విజయ శాంతి అంటే తెలియని వారు వుండరు. ఆమె కేవలం సినిమా నటి మాత్రమే కాదు, రాజకీయ నాయకురాలు కూడా. 1998లో దాసరి నారాయణ రావు రూపొందించిన “ఒసే రాములమ్మ” సినిమా విజయశాంతికి అనూహ్యమైన పేరు తీసుకు వచ్చింది. ఆక్రేజ్ తగ్గక ముందే 1999లో భారతీయ జనతా పార్టీలో చేరిపోయింది. అప్పటికే ఎల్.కె అద్వానీతో ఆమెకు పరిచయం వుంది. ఆయన ప్రోత్సాహం తోనే బీజేపీ లో చేరింది.

సినిమా నటి, అందులోను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో నటించింది. కాబట్టి ఆమె వల్ల పార్టీకి ప్రయోజనం ఉంటుందని భావించిన పార్టీ విజయ శాంతిని భారతీయ జనతా పార్టీ మహిళా విభాగానికి కార్యదర్శిగా నియమించింది. అదే సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరుపున స్టార్ కాంపైనర్ గా ప్రచారం చేసింది. అప్పుడు సోనియా గాంధీ కడప నుంచి పోటీ చేస్తుందని వార్తలు వచ్చాయి. సోనియా మీద పోటీగా విజయ శాంతిని నిలబెట్టాలని పార్టీ నిర్ణయించింది. అయితే సోనియా కర్ణాటక లోని బళ్లారిలో పోటీ చేస్తుందని ప్రకటించడంతో ఆ ప్రతిపాదన ఆగిపోయింది.

KCR

2004 వరకు విజయ శాంతి భారతీయ జనతా పార్టీలోనే వుంది. అయితే తనే ఒక రాజకీయ పార్టీ పెడితే బాగుండునని భావించింది. అప్పటికే తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతుంది. తెలంగాణకు మద్దతు పలికితే రాజకీయ ప్రయోజనం, భవిష్యత్తు ఉండవచ్చని ఆమె భావించింది. అందుకే “తల్లి తెలంగాణ” పార్టీని ప్రారంభించింది. 2006 లో “నాయుడమ్మ” సినిమాతో నటనకు స్వస్తి చెప్పి పూర్తి కాలం రాజకీయాలకే కేటాయించింది. అయితే విజయ శాంతి ఊహించిన ప్రోత్సాహం ప్రజల నుంచి రాలేదు. పార్టీని నడపడం కూడా కష్టమనిపించింది.

GB

అందుకే 2009లో “తల్లి తెలంగాణ” పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేసి కేసీఆర్ తో ఉద్యమ బాట పట్టింది. 2009లో టీఆరెస్ పార్టీ తరుపున మెదక్ నుంచి పార్లమెంటుకు పోటీ చేసి విజయ సాధించింది. ఆ తరువాత తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తన పార్లమెంట్ స్థానానికి కేసీఆర్ తో పాటు రాజీనామా చేసింది. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నది. కేసీఆర్ తరువాత రెండవ స్థానంలో వుంది. తెలంగాణ సాధనలో విజయ శాంతి నిర్వహించిన పాత్ర అపూర్వం. అందుకోసం అదే సమయంలో కేసీఆర్ కూతురు కవిత, కుమారుడు తారక రామారావు ఉద్యమం లో క్రియాశీలకంగా పాల్గొనడం ప్రారంభించారు. అప్పటినుంచి విజయ శాంతి తనకు కేసీఆర్ తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని 2014 ఫిబ్రవరిలో టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరింది. జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అయ్యింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున శాసన సభకు పోటీ చేసి ఓడిపోయింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించలేదు. దీంతో విజయశాంతి తీవ్ర మనస్తాపం చెందింది. చంద్రశేఖర్ రావు పార్టీ టిఆర్ ఎస్ ఘన విజయ సాధించి అధికారంలోకి వచ్చింది. 2018 వరకు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా వుంది. మళ్ళీ రాహుల్ గాంధీని కలిసిన తరువాత 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున స్టార్ క్యాంపెనర్ గా ప్రచారం చేసింది. అయినా కాంగ్రెస్ పార్టీకి ఆశించిన సీట్లు రాలేదు. ఈ ఎన్నికల్లో విజయ శాంతి పోటీ చెయ్యలేదు.

Shanthi 1

తెలంగాణ రాష్ట్రములో కేంద్రలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. ఇది కూడా విజయ శాంతికి కోలుకోలేని దెబ్బ. అందుకే కనీసం సినిమా రంగంలోనైనా నటిగా కోన సాగుదామని నిర్ణయం తీసుకుంది. మహేష్ బాబు హీరోగా “సరిలేరు నీకెవ్వరూ” సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. 13 సంవత్సరాల తరువాత మళ్ళీ విజయ శాంతి మేకప్ వేసుకుంటుంది. విజయ శాంతి తీసుకున్న ఈ నిర్ణయంతో ఇక ఆమె రాజకీయ జీవితం ముగిసిపోయినట్టేనని భావించవచ్చు.

-భగీరథ

Related posts