telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ మృగాడు మైనర్ పేరుతో విడుదల కావడం బాధాకరం : విజయశాంతి

vijayashanthi

నిర్భయ హత్యాచారం కేసులో దోషులైన ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మలను శుక్ర‌వారం ఉరి తీశారు. ఈ ఘటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తాజాగా దీనిపై ప్రముఖ నటి విజయశాంతి స్పందించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో ఒక సుదీర్ఘ పోస్టును పెట్టారు. ‘ఎట్టకేలకు నిర్భయ ఘటన దోషులకు మరణశిక్షపడింది. ఈ పరిణామం కేవలం నిర్భయ కుటుంబానికి మాత్రమే కాదు, ఆడ పిల్లలు ఉన్న ప్రతి కుటుంబానికీ చట్టం అభయం ఇచ్చినట్టయ్యింది. దోషులకు ఉరి అమలు చేసినందుకు యావత్ సమాజం సంతోషపడింది. కానీ ఇంతటి హేయమైన క్రూరత్వానికి పాల్పడిన అసలు నేరస్తుడు మరొకడు మైనర్ పేరుతో విడుదల కావడం బాధాకరం. ఆ మృగాడికి (మృగాలకు క్షమాపణతో…) ఏదో ఒక రూపంలో తగిన శిక్ష పడుతుందని విశ్వసిస్తున్నాను. నిజానికి ఇది సరిపోతుందా? ఈ సందర్భంగా మనం హైదరాబాదులో కలకలం రేపిన ‘దిశ’ కేసు పరిణామాలను కూడా గుర్తు చేసుకోవాలి. నిర్భయ విషయంలో గానీ, ‘దిశ’ ఘటనలో గానీ ఆ దారుణాలు జరిగినప్పుడు యావత్ సమాజం ఆందోళనలకు దిగి దోషులకు వెంటనే శిక్ష పడాలని, ఎన్‌కౌంటర్ చెయ్యాలని భారీ ఎత్తున నిరసనలకు దిగింది. అయితే, న్యాయ ప్రక్రియ ఏళ్ళ తరబడి జాప్యం జరుగుతున్న కొద్దీ కొన్ని వర్గాలు రకరకాల కారణాలు పేర్కొంటూ బాధితులను వదిలేసి దోషుల పక్షం చేరుతున్నాయి. ‘ఈ దోషులకు శిక్ష పడినంత మాత్రాన అత్యాచారాలు ఆగిపోతాయా? వాళ్ళను క్షమించి వదిలేయాలి‘ అనే వాదనలు లేవదీస్తున్నారు. మేధావులుగా చెప్పుకునే అలాంటివారి ఆ వాదన ప్రకారం హత్యాచార దోషులకు శిక్షలే వేయకుండా క్షమిస్తే ఈ దేశంలో ఆడపిల్లను మ్యూజియంలో చూడాల్సిందే. ఆ వాదన ప్రకారం రేపిస్టులను మాత్రమే ఎందుకు క్షమించాలి? దొంగతనాలు, మోసాలు, దాడులకు పాల్పడినవారికి కూడా శిక్షలు పడుతున్నాయి. మరి ఈ నేరాలు మాత్రం ఆగాయా? వీళ్ళను మాత్రం క్షమించ వద్దా? ఇలా నేరాలు ఆగడం లేదు కదా అని శిక్షలే వెయ్యకుండా ఉంటే ఎలా ఉంటుంది? పోలీస్ స్టేషన్లు, కోర్టులను మూసేద్దామా? సమాజాన్ని ఎలా తయారు చెయ్యాలనుకుంటున్నారో ఆ మేధావులే చెప్పాలి?..‘ అని తన సుదీర్ఘ పోస్ట్ లో విజయశాంతి పేర్కొన్నారు.

Related posts