ఏపీలో ఇప్పుడు రెండు రగడలు నడుస్తున్నాయి. అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ఒకటి. అయితే ఈ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణను కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కార్మికులకు ఇప్పటికే అనేక పార్టీలు మద్దతు పలికాయి. పార్టీలకు అతీతంగా విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతు పలకాలని, ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని కార్మికులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 20 వ తేదీన పాదయాత్ర చేసేందుకు సిద్ధమైంది. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఈనెల 20 వ తేదీన విశాఖలోని జీవీఎంసీ నుంచి కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ గేటు వరకు మొత్తం 22 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టబోతున్నారు. కార్మికుల ఆందోళనకు మద్దతుగా ఈ పాదయాత్ర చేపడుతున్నట్టు విజయసాయిరెడ్డి ఈరోజు పేర్కొన్నారు. విశాఖ నగరంలోని అన్ని నియోజక వర్గాలను కవర్ చేస్తూ ఈ మహా పాదయాత్ర చేపట్టబోతున్నారు. చూడాలి మరి ఈ పాదయాత్ర ఎలా జరగనుంది అనేది.
previous post
రాజగోపాల్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు: వీ.హెచ్