కరోనా విజృంభణనకు బ్రేకులు వేసేందుకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ సమర్థవంతంగా అమలు చేయడంలో పోలీసులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా రేయింబవళ్లు రోడ్లపైనే ఉంటూ ఎవ్వరూ బయటకు రాకుండా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసు సిబ్బందిని అభినందించారు హీరో విజయ్ దేవరకొండ.ప్రజల క్షేమం కోసం మేమున్నాం అంటూ అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసుల కోసం తన వంతు సాయం చేయడానికి రాచకొండ సీపీ దగ్గర అనుమతి తీసుకొని, నగరంలోని అన్ని పోలీస్ చెక్ పోస్ట్‌ల వద్ద ఉన్న పోలీసులను కలిసి ఫ్రూట్ జ్యూస్ అందజేశారు విజయ్ దేవరకొండ. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్‌డౌన్ కర్ఫ్యూ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందిని కలిసి వారిపై అభినందనల వర్షం కురిపించారు.
పోలీసుల శ్రమకు హ్యాట్సాఫ్ అని ఆయన అన్నారు. లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలంతా ఇంట్లో ఉంటే పోలీసులు మాత్రం రోడ్లపై డ్యూటీ చేస్తున్నారు. పేద ప్రజలకూ అన్నదానాలు కూడా చేస్తున్నారు. ఈ సమయంలో ప్రజలంతా ఇంట్లోనే ఉంటూ పోలీసులకు సహకరించాలి అని చెప్పారు విజయ్. ముఖ్యంగా మైనర్ తల్లిదండ్రులు వారి పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని ఆయన అన్నారు. పోలీసులకు, డాక్టర్లకు, జీహెచ్‌ఎంసీ సిబ్బందికి సహకరించండి అని విజయ్ దేవరకొండ చెప్పారు. ఇంట్లో పేరెంట్స్‌తో గొడవ పడి మరీ.. మనందరి కోసం విధులు నిర్వహిస్తున్న పోలీసులను చూడడానికి బయటికి వచ్చానని ఆయన తెలిపారు. అందరూ రాష్ట్రం, దేశం కోసం కరోనా వైరస్ తరిమి కొట్టేందుకు ఇంట్లోనే ఉండి పోలీసులకు సహకరిద్దాం. కరోనా పై యుద్ధం సాధించాలంటే కలిసి కట్టుగా ఉండాలి. ప్రభుత్వం ఇప్పటికే అనేక సూచనలు చేసింది. వాటన్నింటినీ పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ పాటించండి, మాస్కులు ధరించండి అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.