telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“వరల్డ్ ఫేమస్ లవర్” మా వ్యూ

WFL

బ్యాన‌ర్‌ : క‌్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌
నటీనటులు : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాశీఖ‌న్నా, క్యాథ‌రిన్ ట్రెసా, ఐశ్వ‌ర్యా రాజేశ్‌, ఇజబెల్లా త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం : క‌్రాంతి మాధ‌వ్‌
సంగీతం : గోపీ సుంద‌ర్‌
కెమెరా : జ‌య‌కృష్ణ గుమ్మ‌డి
ఎడిటింగ్‌ : కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
నిర్మాత‌లు : కె.ఎ.వ‌ల్ల‌భ‌

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ `పెళ్ళిచూపులు`, `అర్జున్‌రెడ్డి`, `గీత గోవిందం` చిత్రాలతో సూపర్ హిట్ లను అందుకున్న విషయం తెలిసిందే. కానీ ఆ తరువాత వచ్చిన నోటా, డియర్ కామ్రేడ్ చిత్రాలతో భారీ ఫ్లాప్ లను చూశాడు. అయినప్పటికీ విజయ్ దేవరకొండకు ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఈ క్రేజీ హీరో తాజాగా “వరల్డ్ ఫేమస్ లవర్” అనే చిత్రంలో నటించారు. ఇదే త‌న చివ‌ర ప్రేమ‌క‌థా చిత్ర‌మంటూ వాలైంటైన్స్ డే రోజున అంటే ఫిబ్ర‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.మరి ఈ సినిమా ఎలా ఉందో ? మళ్ళీ విజయ్ మ్యాజిక్ ను రిపీట్ చేశాడా… లేదా ? తెలుసుకుందాం.

కథ :
గౌతమ్ (విజయ్ దేవరకొండ) ఓ అనాథ. కాలేజీలో యామిని (రాశిఖన్నా) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే గౌతమ్ పెద్ద రైటర్ కావాలనుకుంటారు. ఈ నేపథ్యంలోనే అతనికి మంచి జీతంతో జాబ్ రావడం, ఆ తరువాత యామిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళ పెళ్ళికి ఒప్పుకోకపోవడం… వాళ్ళు ఒప్పుకునే వరకూ వీళ్ళు సహజీవనం చేద్దామని డిసైడ్ కావడం జరుగుతుంది. ఆ తరువాత కథలపై ఇంటరెస్ట్ తో యామినిని నిర్లక్ష్యం చేస్తాడు. దీంతో యామిని బ్రేకప్ చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడు గౌతమ్ ఏం చేశాడు ? అసలు సీనయ్య (విజయ్ దేవరకొండ), సువర్ణ (ఐశ్వర్య రాజేష్), స్మిత మేడమ్ (కేథరిన్) వీళ్లంతా ఎవరు ? వీళ్లకు గౌతమ్, యామినీలకు ఉన్న సంబంధం ఏమిటి ? అసలు గౌతమ్ జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ? చివరకు ఏం జరిగింది ? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో నాలుగు రకాల పాత్రల్లో కన్పించాడు. నాలుగు పాత్రలు కూడా విభిన్నమైనవే. గౌతమ్ పాత్రలో అర్జున్ రెడ్డిని తలపిస్తాడు. కాలేజ్ స్టూడెంట్ గా , గ్రామీణ నేపథ్యం కలిగిన యువకుడిగా, ఫారిన్ లో ఇలా అన్ని పాత్రల్లో ఒదిగిపోయాడు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే… ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఐశ్వర్య రాజేష్ గురించి. ఆమె మినిమల్ మేకప్ తో, చీరకట్టుతో సాధారణ మహిళగా… ఆమె అభినయానికి ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే. స్మితగా కేథరిన్ సరిగ్గా సరిపోయారు. యామినిగా రాశిఖన్నా నటన ఆకట్టుకుంది. లేడీ పైలెట్ గా ఇజబెల్లా నటన బాగుంది. యామిని తండ్రిగా, డబ్బున్న వ్యక్తిగా జయప్రకాశ్ నటన మెప్పిస్తుంది. ఇక ప్రియదర్శి పాత్ర నిడివి తక్కువగా ఉంది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
దర్శకుడు బ్రేకప్ తరువాత ఇద్దరు ప్రేమికుల మనోభావాల ఆధారంగా కథను తెరకెక్కించారు. అయితే ప్రథమార్ధాన్ని చక్కగా ఉంది. కానీ సెకండాఫ్ నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకులకు. గోపి సుందర్ బాణీలు పెద్దగా ఆకట్టుకోవు. ఒక్క “బొగ్గు గనిలో” పాట మాత్రం మెప్పిస్తుంది. నేపథ్య సంగీతం పర్వాలేదు. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి ఓ కొత్త సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకులకు.

రేటింగ్ : 2.5/5

Related posts