telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎయు లో అవినీతి పై విజిలెన్స్ విచారణ పూర్తిచేసి కఠిన చర్యలు తీసుకుంటాం: మంత్రి లోకేష్

ఆంధ్ర యూనివర్సిటీలో మాజీ విసి ప్రసాదరెడ్డి హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై 60రోజుల్లో విజిలెన్స్ విచారణ పూర్తిచేసి, కఠిన మైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు.

ఎయు మాజీ విసి ప్రసాదరెడ్డి అవినీతి, అక్రమాలపై శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణ, గణబాబు, విష్ణుకుమార్ రాజు, కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నలపై రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ గతంలో జరిగిన అవకతవకలపై గౌరవసభ్యులు సభ దృష్టికి తెచ్చారు.

మాకు అందిన సమాచారం ప్రకారం రూ.20 కోట్ల రూసా గ్రాంట్ దుర్వినియోగం, ఇస్రో నుంచి వచ్చిన రూ.25లక్షలను ఖర్చుచేసిన విషయంలో కూడా నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు అందింది.

అవినీతి, అధికార దుర్వినియోగం, విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు ఉపయోగించారని కూడా మా దృష్టికి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ విశాఖపట్నం వెళితే ఆయనకు స్వాగతం పలికేందుకు తరగతులు నిలిపేసి విద్యార్థులను రోడ్లపై నిలిపారు.

ఎయు రిజిస్ట్రార్ తో సహా ఇల్లీగల్ అపాయింట్ మెంట్స్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరీక్షల నిర్వహణలో ప్రైవేటు కళాశాలల నుంచి లంచాలు తీసుకోవడం, మాజీ విసి రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి అప్పటి అధికారపార్టీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించడం, యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ల, ప్రిన్సిపాళ్లను నిబంధనలకు వ్యతిరేకంగా కొనసాగించడం వంటి తీవ్రమైన అభియోగాలు నాటి వైస్ ఛాన్సలర్ పై వచ్చాయి.

దీనిపై ఇన్ చార్జి విసి ఒక కమిటీని నియమించి, అవకతవకలపై నివేదిక కోరారు. గౌరవ సభ్యుల విజ్ఞప్తి మేరకు 60రోజుల్లో విజిలెన్స్ ఎంక్వయిరీ పూర్తిచేసి, నివేదికను ప్రభుత్వానికి పంపించాలని ఆదేశిస్తున్నాం.

విజిలెన్స్ నివేదికను గౌరవసభ్యులకు అందించే బాధ్యత నేను తీసుకుంటా. రిపోర్టు వచ్చిన వెంటనే వర్సిటీలో అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరిస్తాం, ఎవరినీ ఉపేక్షించేది లేదు, మరోసారి పొరపాటు చేయాలంటే భయపడేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి లోకేష్ చెప్పారు.

Related posts