విద్యాబాలన్ హీరోయిన్ గా నటించిన “డర్టీ పిక్చర్” చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను అంగీకరించే సమయంలో కొంతమంది తనకు పిచ్చిపట్టిందంటూ కామెంట్ చేశారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది విద్యాబాలన్. ఈ మేరకు విద్యాబాలన్ మాట్లాడుతూ ‘డర్టీ పిక్చర్’ డైరెక్టర్ మిలాన్ తనపై పూర్తి నమ్మకం ఉంచారని… ఆ సినిమా నిర్మాత ఏక్తా కపూర్ గురించి తనకు అప్పటికే తెలుసని విద్యాబాలన్ తెలిపింది. ఏక్తాతోనే తాను కెరీర్ ను ప్రారంభించానని వెల్లడించింది. మిలాన్ తీసే సినిమాలో కళాసౌందర్యం ఉంటుందనే నమ్మకం తనకుందని… అందుకే సినిమా చెత్తగా ఉండదనే తాను నమ్మానని చెప్పింది. ఇలాంటి సినిమా చేయడానికి నీకు పిచ్చి పట్టిందా? అని కొందరు ప్రశ్నించారని… ఇలాంటి సినిమాలు నీవు చేయకూడదని సూచించారని తెలిపింది. ఈ సినిమాలో నటించడంపై తన తల్లిదండ్రులతో మాట్లాడానని… నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయమని వారు చెప్పారని విద్య తెలిపింది. దీంతో, తాను ‘డర్టీ పిక్చర్’కు ఓకే చెప్పానని వెల్లడించింది. ఈ సినిమా తనకు మంచి పేరును తీసుకొచ్చిందని చెప్పింది. అలనాటి శృంగార తార సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ లో తెరకెక్కిన ‘డర్టీ పిక్చర్’ చిత్రం అఖండ విజయం సాధించింది. ఈ సినిమాలో సిల్క్ స్మిత పాత్రకు విద్యాబాలన్ ప్రాణం పోసింది. విమర్శకుల ప్రశంసలను సైతం ఆమె పొందింది. ఈ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది.
previous post