telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సూర్యకాంతమ్మ 96వ జయంతి… “మనిషి మామిడల్లం మనసు పటికబెల్లం”

Suryakantham

అత్తగారిగా అష్టకష్టాలు పెట్టినా, ఆడపడచుగా ఆడిపోసుకున్నా తోడికోడలుగా తగువులూ, తెగతెంపులూ పెట్టినా, మధ్య తరగతి లోగిలికి చెందిన ఏ స్త్రీ పాత్రని ధరించినా ఆమెకు ఆమే సాటి. ఈరోజు సూర్యకాంతమ్మ 96వ జయంతి. ఎన్ని తరాలు మారినా ‘తెలుగుదనం’ ఉన్నంత వరకు గుర్తుండిపోయే సహజ నటి! ‘‘నేను పోపు పెట్టానంటే ఊరంతా ఘుమఘుమలాడిపోవాల్సిందే…’’ అని ఎడమ చేత్తో గరిటెపట్టుకొని ఎడాపెడా వాయించడం సూర్యకాంతంకే చెల్లింది.

Suryakantham

1924 అక్టోబరు 28న కాకినాడ సమీపంలోని వెంకటకృష్ణరాయపురంలో జన్మించిన సూర్యకాంతానికి చిన్నప్పుడే అల్లరి అమ్మాయిగా ముద్ర పడిందట. స్కూల్లో పంతులమ్మని ఏడిపించడం, ఊళ్ళో సైకిల్‌ మీద చక్కర్లు కొట్టడం, సూటిగా సుత్తితో మేకును దిగ్గొట్టినట్లు మాట్లడడం చిన్నప్పుడే అలవడ్డాయట! కాకినాడ యంగ్‌మెన్స్‌ హ్యాపీక్లబ్‌ నాటకాల్లో వేషాలు వెయ్యడం ద్వారా ఆమెకు అంజలి, ఆదినారాయణరావు, యస్వీ రంగారావులాంటి ప్రముఖులతో పరిచయమై, ఆమె ఆసక్తి వెండితెరవైపు మళ్లింది. నృత్య సన్నివేశాల్లోని గుంపులో కనిపించడం, కథానాయకుల పక్కన చెలికత్తెగా నటించడం లాంటివి తప్ప ఆమె కోరుకున్న హీరోయిన్‌ పాత్రలు లభించలేదు. వరద గోదారిలాగా సంభాషణలు వల్లించగల సామర్ధ్యం ఉన్న ఆ నటి ‘ధర్మాంగద’ చిత్రంలో మూగపాత్రను ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ సినిమాలో హీరోయిన్‌ పాత్ర ధరించే అవకాశం ఇలా ఇచ్చి అలా చేజారిపోయిందట!

Suryakantham

మాటల మధ్యలో ముక్కు ఎగపీలిస్తూ, గొంతులో దుఃఖం పలికిస్తూ, కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ, మెటికెలు విరుస్తూ, శాపనార్థాలు పెడుతూ, తిట్ల వర్షం కురిపిస్తూ గయ్యాళిగా ప్రేక్షకులను మెప్పించింది సూర్యకాంతం. ఒక తరంలో గయ్యాళితనానికి సూర్యకాంతం పేరు పర్యాయ పదమైపోయింది. అగ్గిబరాటా పాత్రలే కాదు అమాయకత్వం, అతి మంచితనం ప్రతిబింబించే పాత్రల్నీ ఆమె అత్యంత సమర్ధంగా పోషించింది. తెలుగు సినిమా రంగంలో ‘‘మీరు తీస్తున్న సినిమాలో ఆవిడా ఉందా?’’ అని పంపిణీదారులు నిర్మాతల్ని వాకబు చేసేవారు! సినిమా పరిభాషలో అది ‘మినిమం గ్యారంటీ! అన్న మాట.

S

అదిగో.. అప్పుడు వచ్చింది సాధనవారి ‘సంసారం’ (1950). ఎన్టీఆర్, ఏయన్నార్‌లు హీరోలుగా ఎల్వీప్రసాద్‌ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం సూర్యకాంతాన్ని కయ్యాలమారిగా గయ్యాళిగంపగా నిలబెట్టింది. ఆమె చలనచిత్ర జీవితానికి ఓ దశనూ, దిశనూ నిర్దేశించింది. అక్కణ్ణించి ఒకటా? రెండా? ఎన్ని సినిమాలు? ఎన్ని పాత్రలు? కొన్ని పాత్రల్రీ, కొన్ని సంభాషణల్ని, ఊతపదాల్నీ కేవలం సూర్యకాంతం కోసమే రచయితలూ, దర్శకులూ సృష్టించిన సందర్భాలు చాలా ఉన్నాయి. గయ్యాళి భార్య, రాచిరంపాన పెట్టే అత్తగారు, చాడీలు చెప్పే ఆడపడుచు, చిచ్చుపెట్టి రెచ్చగొట్టే ఇరుగింటి పొరుగింటావిడ- ఇలా రకరకాలు! హీరో, హీరోయిన్‌ మొదలుకుని హాస్య దుష్ట పాత్రల వరకు ఇతర భాషా చిత్రాల పాత్రల్నో, నటీనటుల్నో స్ఫూర్తిగా తీసుకోవడం ఉందిగానీ సూర్యకాంతం ధరించిన పాత్రలు మాత్రం ఇందుకు మినహాయింపేనని చెప్పాలి. ఆమె ఏ పాత్ర ధరించినా, ఎలా మాట్లాడినా అందులో నూరుపాళ్ల తెలుగుదనమే ప్రతిబించింది. ఏయన్నార్, ఎన్టీఆర్‌లు ప్రధాన పాత్రల్లో ఉన్నా ఆమె ధరించిన పాత్రలే టైటిల్‌గా చేసుకొని ‘గుండమ్మ కథ’ వెలువడిందంటే అది సూర్యకాంతం సాధించిన ‘విజయ’మే? గయ్యాళి పాత్రనే చాలా చిత్రాల్లో వేయాల్సి వచ్చినా ‘భార్యభర్తలు’, ‘బ్రహ్మచారి’, ‘బుద్ధిమంతుడు’, ‘అందాలరాముడు’, ‘ముత్యాల ముగ్గు’ లాంటి చిత్రాల్లో అమాయకత్వాన్నీ సరదానీ పలికించడంలో ఆమె చూపించిన నటన అమోఘం. అలాగే ‘శ్రీమంతుడు’ సినిమాలో కనకాభిషేకం చేసుకొంటూ ఆమె ప్రదర్శించిన హావభావాలు అద్వితీయం!

Suryakantham

సూర్యకాంతం ‘మనిషి మామిడల్లం… మనసు పటికబెల్లం’ అన్నారు ఆరుద్ర. ఆమె ఔదార్యాన్ని హత్తుకునేలా రాశారు ‘కోతి కొమ్మచ్చి’లో ముళ్లపూడి. ఇంటి నుంచి కేరియర్‌ నిండా మోసుకొచ్చి షూటింగ్‌లో అందరికీ వడ్డించిన ఆమె చేతి రుచుల్ని వెనకటి తరం సినిమా ప్రముఖులు కథలు కథలుగా చెప్పుకొంటారు. సూర్యకాంతం మొహమాటంలేని వ్యక్తనీ, ముఖ్యంగా పారితోషికాన్ని వసూలు చెయ్యడంలో ఎక్కడా రాజీపడేవారు కాదని అంటారు. తాను సంపాదించి మరొకరికి సహాయం చెయ్యడం సూర్యకాంతంలోని గొప్ప లక్షణాలని ఆవిడ గురించి బాగా తెలిసిన సినీ ప్రముఖులు అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. చరమాంకంలో చిరు తెరపై కూడా తన ప్రతాపాన్ని చూపించి అత్తరికాన్ని చెలాయించిన ఆ మహానటి 1994 డిసెంబరు 18 నాడు స్వర్గస్తురాలయ్యారు సూర్యకాంతం.

Related posts