telugu navyamedia
ఆరోగ్యం

సంపూర్ణారోగ్యానికి .. వేపాకు..

వేపతో భారతీయులకు ఉన్న సంబంధం ఇప్పటిది  కాదు. తినేందుకు చేదుగా ఉన్నా దాని వలన కలిగే ప్రయోజనాలు పలురకాలు. దానిని తీసుకోవడం వలన సంపూర్ణ ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది అంటున్నారు ఆయుర్వేద వైద్యనిపుణులు. వాస్తవానికి, ఇప్పటి వరకు ఉన్న మొక్కలలో వేపాకు ఒక బహుముఖ ప్రయోజనకరమైనది. ఆయుర్వేదం ప్రకారం, పలురకాల అనారోగ్యాలకు ఇది శక్తివంతమైన ఔషధం. 4500 సంవత్సరాల క్రితం నుండే దీనిని ఆరోగ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారనేందుకు బలమైన ఆధారాలున్నాయి. పిత్త మరియు కఫ సంబంధిత సమస్యల నివారణకు ఆయుర్వేదం వేపాకులను ప్రధానంగా వినియోగిస్తున్నా, వీటితో మరెన్నో రకాల ముఖ్య ప్రయోజనాలున్నాయి.
ఇది రక్తాన్ని శుద్ది చేస్తుంది, విషపదార్థాలను తొలగిస్తుంది, క్రిమి కాట్లు మరియు అల్సర్లకు చికిత్స చేస్తుంది, శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ ను నివారిస్తుంది, గాయాలు, కాలిన గాయాలు, ఇన్ఫెక్షన్లు మరియు ఇతర చర్మ సమస్యలను త్వరగా నయం చేస్తుంది, ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియాను హతమార్చి రోగనిరోధక శక్తి కూడా పెంచుతుంది.
ఇంకా చెప్పాలంటే వేపాతో లెక్కలేనన్ని ప్రయోజనాలున్నాయి. వేపాకును మీ నిత్య జీవితంలో పది రకాలుగా ఉత్తమమైన రీతిలో వినియోగించి సంపూర్ణారోగ్యాన్ని ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
* వేపాకు రోగనిరోధక శక్తిని అమితంగా పెంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు వేపాకుల కషాయాన్ని తీసుకోవడం ద్వారా వాటిలోని యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీమైక్రోబియల్ లక్షణాలను పూర్తిగా గ్రహించవచ్చు. కేవలం కొన్ని వేపాకులను తీసుకుని వాటిని చితక్కొట్టి వాటికి కొంచెం వేడి నీటిని చేర్చి తాగండి. ఇది మీ సాధారణ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సులభమైన మార్గం.
* శరీరంలో చేరిన విష పదార్థాలను తొలగించేదిగా అమోఘమైన పేరు తెచ్చుకున్న వేపాకు గురించి ఆయుర్వేదం చెపుతున్నదాని ప్రకారం, దానిలోని చేదు రుచి, జీవక్రియను అనుకూలపరచడం ద్వారా ఆయా చెడును విసర్జింపచేసే కాలేయం మరియు మూత్ర పిండాలను ఉద్దీపనం చేస్తుంది. వేపాకులను పొడి చేసి, ఆవు నెయ్యితో కలుపుకుని తినవచ్చు. లేకపోతే, విషపదార్ధాల తొలగింపునకు దానిని సప్లిమెంటుగా కూడా తీసుకోవచ్చు.
* రక్తంలోని సుగర్ స్థాయులను నిలకడగా ఉంచుకోవడంలో వేప ప్రభావవంతంగా ఉండగలదని మీకు తెలుసా? ఈ ఔషధంలోని రసాయన భాగాలు ఇన్సూలిన్ స్వీకరణ నిర్వహణ వ్యవస్థను అనుకూలపరిచి, సరైన మోతాదులో ఇన్సూలిన్ పొందేలా చేయడంలో చక్కని పాత్ర పోషిస్తాయి. కాబట్టి, వేపాకు మధుమేహులు ఇన్సూలిన్ పై తక్కువగా ఆధారపడేలా చేయగలదు. ఏదేమైనా, దీని మోతాదు మరియు ఇతర అంశాలపై వైద్యుడిని సంప్రదించండి.
* వేపాకు పేగుల్లోని వాపును తగ్గిస్తుంది, పుండ్లు, కడుపు ఉబ్బరం, తిమ్మిర్లు, మలబద్ధకంను తగ్గించి కడుపులో ఇన్ఫెక్షన్ ను నిరోధిస్తుంది. పరిపూర్ణమైన జీర్ణ, విసర్జక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
* వేప యొక్క యాంటీ-ఇన్ఫ్లమేటరి లక్షణాలు కీళ్లవాతం చికిత్సకు గొప్పగా ఉపయోగపడతాయి. వేపాకు తైలం లేదా లేహ్యం నొప్పితో బాధించబడే కీళ్లు మరియు కండరాలపై రాయడం ద్వారా నొప్పి మరియు అసౌకర్యం నుండి ఉపశమనం కలిగించవచ్చు.
* దాదాపు అన్ని నోటి ఆరోగ్య ఉత్పత్తుల్లో వేప సాధారణ దినుసు. వేప యొక్క యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చిగుళ్ల వ్యాధులు మరియు నోటి దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను తొలగిస్తాయి. వేప నీతిని మౌత్ వాష్‌గా ఉపయోగించవచ్చు. వేప పుల్లలను టూత్ బ్రష్ గా కూడా వాడుకోవచ్చు.
* లేత వేపాకులను నీటిలో మరిగించి పూర్తిగా చల్లబరచండి. ఈ నీటిని మీ కళ్లను కడిగేందుకు వినియోగించడం ద్వారా మండుతున్న, ఎర్రబారిన లేదా అలసిపోయిన కళ్లకు చక్కని ఉపశమనం లభిస్తుంది. కొన్ని ఆకులను ముద్దగా చేసి దానికి తేనె జోడించి చెవి గడ్డలకు చికిత్స చేయవచ్చు.
* కప్పు వేపాకులను తీసుకుని అవి మృదువుగా మరియు రంగు మారే వరకు నీటిలో మరిగించండి. ఆ నీటిని వడకట్టి, చల్లబరిచి ఒక సీసాలో భద్రపరచండి. దీనిని ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కలిపి వాడటం వల్ల మొటిమలు, చర్మ ఇన్ఫెక్షన్, శరీర దుర్వాసన లాంటివి నివారించవచ్చు. కొన్ని ఆకులను రుబ్బి వాటితో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమలు నివారించబడతాయి. సాధారణంగా, వేపాకుల పేస్టు గాయాలు మరియు ఇతర చర్మ సంబంధిత అనారోగ్యాల నివారణకు ఉపయోగించబడుతుంది. వేపాకు నీరు అద్బుతమైన స్కిన్ టోనర్, దీనిని ఏదైనా కాలిన గాయంపై రాస్తే, అది త్వరగా మానిపోయేలా చేసి సదరు శరీర భాగాన్ని ఇన్ఫెక్షన్ మరియు అలర్జీల నుండి కాపాడుతుంది.
* మరిగే నీటిలో వేపాకులను వేయండి, అది చల్లబడిన తర్వాత మీ జుట్టును కడిగేందుకు వాడండి. ఈ మూలికలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణం తలలోని పేలు, చుండ్రు, పొడి మాడు, జుట్టు రాలడం, జుట్టు జిడ్డుగా ఉండడం లాంటి సమస్యలను నివారిస్తుంది. ఇది మీ జుట్టును మృదువుగా, ఆకర్షణీయంగా మార్చుతుంది.
* వేప అన్ని రకాల క్రిమికీటకాలను అద్భుతమైన రీతిలో పారదోలుతుంది. వేపతో నానబెట్టిన దూదిని మీ కిటికీ దగ్గర ఉంచడం లేదా వేపాకుల పొగ వేయడం ద్వారా క్రిములను పారద్రోలవచ్చు. దోమలతో పోరాటానికి ఇది ఒక ప్రకృతి సిద్ధ మార్గం.
గమనిక: వేప శక్తివంతమైన మూలిక అయినందున, దీనిని పసిబిడ్డలకు, నవజాత శిశువులకు ఉపయోగించరాదు. అంతేకాకుండా, గర్భిణీలు, మూత్రపిండాలు లేదా కాలేయ సమస్యలతో బాధపడేవారు, మధుమేహులు వేప సప్లిమెంట్లను తీసుకునేముందు వైద్య నిపుణులను సంప్రదించాలి.
vepakutho sampurna aarogyam

Related posts