telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

మాతృభాషను మనసులో నింపుకోవాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్య

venkaiah Naidu Bjp

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ లో స్పందించారు. మాతృభాషను మనసులో నింపుకోవాలని వివరించారు. విజ్ఞానం అందరికీ అందాలనే ఉద్దేశంతో గిడుగు రామ్మూర్తి వ్యవహారిక భాషోద్యమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. మాతృభాషను కాపాడుకోవడమే వారికి అందించే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు.

మాతృభాష పట్ల ప్రేమ పెంచుకోవడం అంటే ఇతర భాషలు నేర్చుకోవద్దని భావించరాదని పేర్కొన్నారు. అన్ని భాషలు నేర్చుకుని భాష ద్వారా మంచి సంస్కృతితో పాటు సమాజ నిర్మాణం దిశగా ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నానంటూ ఆయన ట్విట్టర్ లో వెల్లడించారు.

ఆదర్శవంతమైన సమాజ నిర్మాణానికి భాష, సంస్కృతులే పునాది అని వెంకయ్య స్పష్టం చేశారు. అయితే ప్రపంచకీకరణ నేపథ్యంలో పలు భాషలు అంతరించే ప్రమాదంలో పడ్డాయని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తున్న ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, జపాన్, ఇటలీ, బ్రెజిల్, రష్యా వంటి దేశాల ఒరవడిని ఆదర్శంగా తీసుకోవాలని వెంకయ్య పిలుపునిచ్చారు.

Related posts