telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎస్పీ బాలుతో చిన్నప్పటినుంచి చాలా పరిచయముంది : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

SPB

గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు బాలు. 50 రోజులుగా హాస్పిటల్‌లో పోరాడుతూ కరోనాను జయించిన ఆయన ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో.. శుక్రవారం (సెప్టెంబర్ 25) మధ్యాహ్నం 1.04 గంటలకు తుది శ్వాస విడిచారు. బాలు ఇక లేరనే వార్తతో దేశం చిన్నబోయింది. బాలు కుటుంబసభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాలు మృతిపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. “ప్రముఖ నేపథ్య గాయకుడు, ఐదున్నర దశాబ్ధాలుగా తమ అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించింది. వారు కరోనాబారిన పడి ఎంజీఎం ఆసుపత్రిలో చేరారని తెలిసినప్పటినుంచి వైద్యులతో రోజూ మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తూ వచ్చాను. వారి కుమారుడితో మాట్లాడి కావాల్సిన సలహాలు ఇస్తూ వైద్యులకు సూచనలు చేస్తుండేవాడిని. గాన గంధర్వుడైన శ్రీ ఎస్పీ బాలు మా ఊరివాడైనందున చిన్నప్పటినుంచి చాలా పరిచయముంది. ఆయన కోలుకుంటున్నారని, రోజూ కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడుతున్నారని తెలిసి సంతోషిస్తుండగానే ఇలా జరగడం బాధాకరం. వారు కోలుకుంటున్నారని భావిస్తున్న తరుణంలోనే ఇలా జరగడం విచారకరం. వివిధ భారతీయ భాషల్లో ఎన్నో పాటలకు ప్రాణం పోసిన శ్రీ బాలు ఈటీవీలో పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా వేలాది యువ తెలుగు గళాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు” అంటూ వరుస ట్వీట్లు చేశారు వెంకయ్య నాయుడు.

Related posts