telugu navyamedia
తెలంగాణ వార్తలు వ్యాపార వార్తలు

భారీగా పెరిగిన.. టమాటా ధర…

vegetable rates raised

నిత్యావసర వస్తువులు చలికి త్వరగా పాడైపోతుండటంతో.. ఉత్పత్తి ప్రశ్నర్ధకంగా ఉంది. దీనితో కావాల్సినంత ఉత్పత్తి లేకపోవటంతో.. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. టమాటా ప్రతివారికి నిత్యం ఎంత అవసరంలో అందరికి తెలుసు. అలాంటిది ఇప్పుడు పంట తగ్గిపోవటంతో, ధరలు పెరిగిపోతున్నాయి. తాజా పరిస్థితులలో, కూరగాయల ధరలు మండుతున్నాయి. గత నెలరోజుల వ్యవధిలోనే టమాటా ధర ఏకంగా పదిరెట్లు పెరిగింది. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌, నాసిక్‌, కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌, కోలార్‌ తదితర ప్రాంతాల నుంచి టమాటా, వంకాయలు వంటి సాధారణ కూరగాయలు సైతం వస్తున్నాయి. వాస్తవానికి వీటి టోకు ధరలు ఆయా రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నా ఇక్కడికి తేవడానికి రవాణా వ్యయం, తరలింపులో పాడవటం వంటి కారణాలతో ఇక్కడ ధర అమాంతం పెరుగుతోంది. సరిగ్గా నెలక్రితం స్థానిక రైతులు టమాటాలు అధికంగా తెచ్చినప్పుడు ధర లేక నష్టపోయారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి అధిక ధరలకు అమ్ముతుంటే సామాన్యులు నష్టపోతున్నారు.

కూరగాయ పంటల సాగు, దిగుబడి తెలంగాణ జిల్లాల్లో బాగా తగ్గడం వల్లే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయని మార్కెటింగ్‌ శాఖ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో గత జూన్‌ నుంచి ఇప్పటివరకు 18 జిల్లాల్లో వర్షపాతం లోటు 20 నుంచి 49 శాతం దాకా ఉంది. కూరగాయల సాగు ఎక్కువగా బోర్లు, బావుల కింద ఉంటుంది. వీటిలో భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలకు నీరందించడం కష్టంగా మారిందని రైతులు వాపోతున్నారు. పంటలు అంతంతమాత్రమే ఉంటే మరోవైపు గత నెలరోజులుగా చలి తీవ్రత బాగా పెరిగింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలలోపు పడిపోతున్నాయి. చలికి కొన్ని పంటల ఎదుగుదల చాలా తక్కువగా ఉంది. మంచు కురుస్తున్నందున కూరగాయలపై మచ్చలు ఏర్పడి దెబ్బతింటున్నాయి. రాష్ట్రంలో దిగుబడి అంతంతమాత్రంగా ఉండటం, అందులోనూ నాణ్యత లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాటికి డిమాండ్‌ పెరిగింది.

హైదరాబాద్‌లోని అన్ని మార్కెట్లకు బోయిన్‌పల్లి టోకు మార్కెట్‌కు రోజూ వచ్చే కూరగాయలే కీలకం. ఉదాహరణకు ఈ మార్కెట్‌కు గతేడాది(2018) జనవరి 11న 2,208 క్వింటాళ్ల టమాటాలు అమ్మకానికి రాగా ఈ ఏడాది సరిగ్గా అదేరోజున శుక్రవారం అంతకన్నా 37.72 శాతం తగ్గి 1,375 క్వింటాళ్లే వచ్చాయి. ‘నగరంలో జనాభా, వినియోగానికి తగ్గట్టుగా ఏటా కూరగాయల రాక పెరిగితేనే ధరల నియంత్రణ కష్టం. కానీ గతేడాది వచ్చినవాటికన్నా 37 శాతం తక్కువగా వస్తే ఇక ధరల నియంత్రణ అసాధ్యం’ అని మార్కెటింగ్‌ అధికారి ఒకరు ‘ఈనాడు’కు చెప్పారు. నెలక్రితం టమాటా టోకు ధర కిలో రూ. 3కు పడిపోగా ఇప్పుడు పది రెట్లు పెరిగి రూ.30కి చేరినట్లు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సైతం తెలంగాణకు సరిపడా రావడం లేదని వివరించారు.

Related posts