telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

వాయు తుఫాన్ .. గుజరాత్ లో హై అలర్ట్ .. అమిత్ షా సమీక్ష..

vayu cyclone gujarat high alert

వర్షాలు వస్తున్నాయి అనేసరికి .. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ‘వాయు’ తుఫానుగా మారి వాయువేగంతో దూసుకెళ్తోంది. గుజరాత్ తీరం వైపు శరవేగంగా పయనిస్తోంది. తుఫాను కారణంగా భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో గుజరాత్‌లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తర గుజరాత్‌లోని బనస్‌కాంత, సబర్‌కాంత జిల్లాల్లో తుఫాను వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను కారణంగా గంటకు 40 నుంచి 50కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వాయుతుఫాను గురువారం ఉదయం పోర్ బందర్, మహువా ప్రాంతంలో వాయు తుఫాను తీరాన్ని దాటే అవకాశముందని ఐఎండీ అంచనా వేస్తోంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సౌరాష్ట్ర, భావ్‌నగర్, గిరి సోమనాథ్, జునాగఢ్, డియూ, నవసరి, వల్సాద్, డామన్,, దాద్రానగర్ హవేలీ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి.

గుజరాత్ ప్రభుత్వం వాయు తుఫాను నేపథ్యంలో అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు ఆర్మీ, కోస్ట్ గార్డులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఫొని తుఫాను సమయంలో ఒడిశా ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలివ్వడంతో గుజరాత్ ప్రభుత్వం అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. తుఫాను కారణంగా అధికారుల సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. తుఫానుపై చర్చించేందుకు గుజరాత్ రాష్ట్ర కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. తుఫాను ప్రభావిత జిల్లాలకు ఆయా ప్రాంత మంత్రులను పంపి సహాయకచర్యల్ని ముమ్మరం చేయనున్నట్లు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ప్రకటించారు. గుజరాత్‌ వైపు దూసుకొస్తున్న వాయు తుఫానుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. తుఫాను నష్టాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. తాగునీరు, కరెంటు, టెలి కమ్యూనికేషన్, ఆరోగ్య సేవలకు ఎలాంటి విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అమిత్ షా సూచించారు. సైక్లోన్ ప్రభావం చూపనున్న గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్నాటక, డామన్ డయ్యూలోని ప్రభుత్వాలతో కేంద్ర హోం శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.

Related posts