telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మహాపాదయాత్రలో వరినాట్లు..

ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి… ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే నినాదంతో అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం నెల్లూరుజిల్లా వెంకటగిరి ప్రాంతానికి చేరుకున్న పాదయాత్ర రేపు చిత్తూరుజిల్లాలోకి ప్రవేశించబోతోంది. దారిపొడవునా… గ్రామీణప్రజానీకం మహాపాదయాత్రకు నీరాజనాలుపలుకుతున్నారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో తలపెట్టిన పాదయాత్రలో మతసామరస్యానికి ప్రతీకగా హిందూ, ముస్లిం, క్రైస్తవ ప్రచార రథాలు కలిసొస్తున్నాయి.

బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అమరావతి రైతులు ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించిన తర్వాత పాదయాత్రను ప్రారంభించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహారిస్తుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంతంగా కొనసాగిన రైతుల పాదయాత్ర బాలాయపల్లి మండలం, అక్కసముద్రం వద్ద పంటపొలాల్లో స్థానిక రైతు కూలీలతో కలిసి వరినాట్లు వేశారు. రైతులు పడే కష్టాలను , రైతుల శ్రమను గుర్తుచేసుకున్నారు. పాదయాత్ర ఆద్యంతం ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది.

36 రోజు రైతుల మహాపాదయాత్రలో పశ్చిమగోదావరిజిల్లా దెందులూరు మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ సంఘీభావంతెలిపారు. రైతులతో పాటు కలసి ఆయన పాదయాత్ర చేశారు. పాదయాత్ర వెంకటగిరి నియోజక వర్గం వెంగమాంబ పురం నుండి వెంకటగిరి చేరుకుంది. పెద్ద సంఖ్యలో స్థానికులు స్వాగతం పలికారు. రైతులకి తెలంగాణ మహిళలు, తెలంగాణ మహిళా జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న సంఘీభావం తెలిపారు. ప్రజలు, అన్ని పార్టీలు ఒకే రాజధాని ఉండాలని కోరుతుంటే జగన్ మూడు రాజధానులనడం సమంజసం కాదని జ్యోత్స్న అభిప్రాయం వ్యక్తంచేశారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు ముందున్నాయని పేర్కొన్నారు.

Related posts