కేటీఆర్ తనను రెండుసార్లు టీఆర్‌ఎస్ లోకి ఆహ్వానించినా తాను వెళ్లలేదని, ఈసారి మాత్రం గట్టిగా అడిగేసరికి ఆ మాటకు కట్టుబడితో తాను టీఆర్‌ఎస్ లో చేరినట్టు వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ సీఎంగా చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజలకు చేరాయని చెప్పారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకు భారీగా ఓట్లు పడ్డాయని అన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టు రైతుల పక్షాన నిలబడి తాను అనేక లాఠీ దెబ్బలు తిన్నానన్నారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు సరైనవని ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. కేసీఆర్ హయాంలో గజ్వేల్ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. ఇదివరకే తాను టీఆర్‌ఎస్ లో చేరి ఉంటే ఎంతో బాగుండేదని అభిప్రాయపడ్డారు.