telugu navyamedia
తెలంగాణ వార్తలు

టీఆర్ ఎస్‌ నుంచి వనమా రాఘవ సస్పెండ్

ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఎ1నిందితుడిగా ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు, తెరాస నేత వనమా రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ అధినేత కేసీఆర్‌ ఆదేశాలతో మేర‌కు రాఘవను సస్పెండ్‌ చేసినట్లు పార్టీ తెలిపింది. ఈ సస్పెన్షన్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది.

రామకృష్ణ ఆత్మహత్య తర్వాత రాఘవ రెండు మూడు సార్లు మీడియా ముందుకు వచ్చారు. ఈ కేసులో తనకెలాంటి సంబంధం లేదని.. కావాలని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఈ నెల 3 వ తేదీన పాల్వంచలో రామకృష్ణ తన భార్యా పిల్లలతో ఆత్మహత్య చేసుకొన్నాడు.అదే రోజున రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి తో పాటు పెద్ద కూతురు సాహిత్య మరణిచారు. ఈ ఘటనలో తీవ్రంగా కాలిన గాయాలతో రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్న కూతురు సాహితీ బుధవారం నాడు మరణించింది.

ఈ క్రమంలో ఆత్మహత్యకు ముందు తీసిన సెల్పీ వీడియోలో వనమా రాఘవేందర్ తనతో వ్యవహరించిన తీరును రామకృష్ణ వివరించారు. ఆయన వేధింపుల వల్లే తమ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రామకృష్ణ సెల్ఫీ వీడియో, సూసైడ్​ నోట్​లో పేర్కొన్నారు.

ఏ భర్తకూడా వినకూడని మాటలను రాఘవ అన్నారని ఆవేదన చెందాడు. రాజకీయ, ఆర్థిక బలంతో రాఘవ.. పబ్బం గడుపుకోవాలని చూశారని విమర్శించాడు. తాను చనిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు అందుకే.. వారితో పాటు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు.

దీంతో పలు ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు రాఘవను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశాయి. నేడు కొత్తగూడెం నియోజకవర్గం మొత్తం బంద్​ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి ఆయన్ను సస్పెండ్‌ చేస్తున్నట్లు తెరాస ప్రకటించింది.

.

Related posts