telugu navyamedia
సినిమా వార్తలు

“గద్దలకొండ గణేశ్‌”గా మారిన “వాల్మీకి”… అయినా వివాదం ముగియలేదా ?

Valmiki

వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ నిర్మించిన “వాల్మీకి” సినిమా టైటిల్‌ మారింది. సినిమా టైటిల్‌ను “గద్దలకొండ గణేశ్‌”గా మార్చారు. “వాల్మీకి” టైటిల్‌ అభ్యంతరకరంగా ఉందని బోయ సామాజిక వర్గానికి చెందిన బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై తమకు హైకోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో టైటిల్‌ మార్చినట్టు గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీ ఆచంట తెలిపారు. ఈ సందర్భంగా గోపీ ఆచంట మాట్లాడుతూ “సినిమా చూసిన సెన్సార్‌ బోర్ట్‌ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఓ వర్గాన్ని కించపరుస్తూ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించాలనీ సినిమా పరిశ్రమలో ఎవరూ అనుకోరు. అనంతపురం, కర్నూల్‌, కడప జిల్లాల్లో సినిమా కొనుకున్న బయ్యర్లు నష్టపోకూడదని టైటిల్‌ మార్చాం” అని అన్నారు.

హరీశ్‌ శంకర్‌ మాట్లాడుతూ “సినిమా టైటిల్‌ బోయ, వాల్మీకి సామాజిక వర్గాల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని టైటిల్‌ మార్చాలన్నారు. సినిమా చూసి వాల్మీకి మహర్షి గురించి తప్పుగా చెబితే మీ మాటకు అంగీకరిస్తాం అని గతంలోనే నేను చెప్పాను. టైటిల్‌ పక్కన ఉన్న తుపాకీని తొలగించమంటే అప్పుడే తొలగించేశాం. ఫైనల్‌గా సినిమా చూడకుండానే వాల్మీకి మహర్షిని చెడుగా చూపిస్తున్నామని అపార్థం చేసుకుని కోర్టులో కేస్‌ వేశారు. అనంతపురం, కర్నూల్‌, కడప జిల్లాల్లో సినిమా విడుదల నిలిపేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. బయ్యర్లు నష్టపోకూడదని సినిమా టైటిల్‌ మార్చి విడుదల చేస్తున్నాం. బోయ సోదరులు అర్థం చేసుకోలేదన్న బాధ నన్ను వెంటాడుతుంది. నా సినిమాలు ఫెయిల్‌ అయినప్పుడు కూడా నేను బాధపడలేదు. ఓ మంచి విషయాన్ని ప్రేక్షకులకు చెప్పాలనుకున్నాను. అది జరగకపోవడంతో ఓడిపోయానన్న భావన మొదటిసారి కలిగింది. శుక్రవారం విడుదల కానున్న నా సినిమా తప్పకుండా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సినిమా చూశాక వారే సినిమాలో ఎలాంటి పొరపాటు లేదని చెబుతారు. మనిషి ఉన్న లేకపోయినా సినిమా అనేది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది’’ అని అన్నారు. ‘‘సినిమా టైటిల్‌ విషయంలో చాలా పోరాడం. కానీ మార్చక తప్పలేదు” అని తెలుగు ఫిల్మ్‌ఛాంబర్‌ సెక్రటరీ కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌ చెప్పారు. అయితే ఈ వివాదం ఇంకా ముగిసిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. పేరు మార్చిన‌ట్టు ప్రచారం మాత్ర‌మే చేస్తున్నారు. సెన్సార్ బోర్డ్ స‌ర్టిఫికెట్స్‌తో పాటు మిగ‌తా వాటిలో వాల్మీకి అనే ఉంది. ఆ పేరు మార్చే వ‌ర‌కు ఆందోళ‌న కొన‌సాగిస్తాం అని వాల్మీకి సంఘం నేత‌లు అంటున్నారు. దీనిపై హ‌రీష్ శంక‌ర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related posts