telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వైసీపీలో ముదురుతున్న‌ వర్గపోరు..తాను హీరోనో ?.. విలన్‌నో? గన్నవరం ప్రజలకు తెలుసు..

ఏపీలో అధికార వైసీపీలో వ‌ర్గ‌పోరు రోజురోజుకు ముదురుతోంది. నిన్నటి నిన్న మచిలీపట్నం లో పేర్ని నాని, బాలశౌరి వర్గీయులు బాహాబాహీకి దిగగా.. నేడు యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీల మ‌ధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది.

టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వైఎస్ఆర్‌సీపీలో చేరడాన్ని యార్లగడ్డ వెంకట్రావుతో పాటు అత‌ని అనుచ‌ర వ‌ర్గం ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. వారిలో నెల‌కొన్న అసమ్మతిని బ‌హిరంగంగానే వెళ్లగక్కుతున్నారు.వంశీతో కలిసి పనిచేసేది లేదని తెగేసి చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ను విలన్‌తో పొల్చుతూ  యార్లగడ్డ వెంకట్రావు , దుట్టా రామచంద్రరావు నిన్న విమర్శలు గుప్పించారు.  2019 గన్నవరం అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓ విలన్‌పై పోటీ చేసి ఓడిపోయానని.. అతడిని పార్టీలోకి తీసుకోవడాన్ని కూడా తాను వ్యతిరేకించినట్లు యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యలు చేయడంపై వంశీ ఇవాళ స్పందించారు.

జస్టిస్ చౌదరిలుగా దారినపోయే ప్రతివాడు కామెంట్స్ చేస్తుంటారని వ్యంగ్యంగా అన్నారు.నియోజకవర్గంలోని ప్రజలకు ఏం చేయాలో తనకు తెలుసని పేర్కొన్నారు. ‘‘పనిచేయకుండా హడావుడి చేసే వాళ్లను చాలా మందిని చూశాను.

సీఎం జగన్ త‌నను ప‌ని చేయమన్నార‌నీ, ఆయ‌న ఆదేశాల అనుసారంగా చేస్తున్న‌న‌నీ వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. ఒకవేళ ఈ విషయంలో యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావుకి బాధ ఉంటే సీఎంను కలవాలని అన్నారు.అంతేకానీ.. పిచ్చి కామెంట్లు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని వార్నింగ్ ఇచ్చారు.

తాను హీరోనో ?.. విలన్‌నో? గన్నవరం ప్రజలను అడిగితే చెబుతారని అన్నారు. త‌నని విలన్ అన్న వాళ్లు మహేష్ బాబు, ప్రభాస్‌లా? అని ఎద్దేవా చేశారు.. తనకు సీఎం జగన్‌ మద్దతు ఉంద‌న్నారు. దారిని వచ్చేపోయే వారి గురించి పట్టించుకోని అన్నారు.

 తాను గెలిచినా.. ఓడిపోయినా.. గన్నవరంలో ఉంటానని స్ప‌ష్టం చేశారు. ఊరు, దేశం వదిలిపోయే వాళ్లు.. ఊరికే వచ్చి పారిపోయేవాళ్లను చాలా మందిని చూశామ‌ని వంశీ అన్నారు.

ఉంగుటూరు మండలం పొణుకుమాడు గ్రామంలో శనివారం గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న వల్లభనేని వంశీ వైఎస్సార్‌సీపీకి చెందిన యార్లగడ్డ, దుట్టా టార్గెట్‌గా ఈ వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ చౌదరిలుగా రోడుపై వెళ్లే ప్రతివాడూ కామెంట్స్ చేస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సందించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి సీటు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డే చూసుకుంటారని.. తనకు ప్రజల ఆశీర్వాదం ఉందని వంశీ అన్నారు.

 అన‌వ‌స‌రంగా మట్టి గురించి రాద్దాంతం చేస్తున్నార‌నీ వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు చేసేవాళ్లంతా చంద్రబాబు స్కూల్ చెందిన వాళ్లేన‌ని ఎమ్మెల్యే వంశీ ఎద్దేవా చేశారు.

Related posts