telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జనవరిలోనే “వలస” వస్తోంది

రెండు తెలుగు రాష్ట్రాలల్లోని ప్రభుత్వాలూ థియేటర్ల రీ- ఓపెనింగ్ కు జీవోలు జారీ చేసినా, యాభై శాతం ఆక్యుపెన్సీతో చిత్రాల ప్రదర్శనపై కొన్ని జిల్లాల్లోని ఎగ్జిబిటర్స్ మల్లగుల్లాలు పడుతున్నారు. మరీ ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ, నెల్లూరు జిల్లాలోనూ ఎగ్జిబిటర్స్ సినిమాల ప్రదర్శనకు ఇంకా శ్రీకారం చుట్టలేదు. మిగిలిన జిల్లాల్లోనూ నామమాత్రంగానే సినిమాల ప్రదర్శన జరుగుతోంది. అయితే… డిసెంబర్ 25న సాయిధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ విడుదల అవుతుండటంతో ఆ సమయానికి వాళ్ళు సినిమా హాళ్లను తెరిచే ఆస్కారం ఉంది. అందువల్లే ఈ నెల 18న విడుదల చేయాలనుకున్న తమ ‘వలస’ చిత్రాన్ని జనవరి 1కి వాయిదా వేశామని దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. మనోజ్ నందం, తేజు అనుపోజు, వినయ్ మహాదేవ్, గౌరి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను యెక్కలి రవీంద్రబాబు నిర్మించారు. ప్రవీణ్ ఇమ్మడి సంగీతాన్ని, మనోహర్ సాహిత్యాన్ని అందించారు. లాక్ డౌన్ సమయంలో లక్షలాది వలస కార్మికులు తమ సొంత వూళ్ళకు వెళ్లడానికి రోడెక్కిన విషయం తెలిసిందే! ఇదే నేపథ్యంలో వలస కార్మికుల జీవితాల్లోన్ని నవ్వులను, ప్రేమలను, మానవ సంబంధాలను కూడా హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించినట్టు సునీల్ కుమార్ రెడ్డి చెబుతున్నారు.

Related posts