telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

విజృంభిస్తున్న కరోనా.. యూపీలో 15 జిల్లాలు మూసివేత!

UP Assembly

ఉత్తరప్రదేశ్ లో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం 15 జిల్లాలను ఈ నెల 13 వరకు పూర్తిగా మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. నేటి అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ నేపథ్యంలో నిత్యావసరాలకు ఇబ్బంది కలగకుండా ప్రజల ఇళ్ల వద్దకే వాటిని చేరవేసేలా ఏర్పాట్లు చేసినట్టు యూపీ చీఫ్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ తివారీ ట్వీట్ చేశారు.

లక్నో, ఆగ్రా, ఘజియాబాద్, గౌతంబుద్ధ్‌నగర్ (నోయిడా), కాన్పూర్, వారణాసి, షామ్లి, మీరట్, బరేలీ, బులంద్‌షహర్, ఫిరోజాబాద్, మహారాజ్‌గంజ్, సీతాపూర్, షహరాన్‌పూర్, బస్తీలు కరోనా హాట్‌స్పాట్‌లుగా మారడంతో యోగి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మూసివేత నిర్ణయంపై తిరిగి 13న సమీక్ష నిర్వహిస్తామని రాజేంద్రకుమార్ పేర్కొన్నారు.

బుధవారం నాటికి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 326కు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 37 జిల్లాల నుంచి కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కారణంగా ఇప్పటి వరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల్లో 166 తబ్లిగీ జమాత్‌తో లింక్ ఉన్నవే కావడం గమనార్హం.

Related posts