telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

చైనాకు అనుగుణంగా నిర్ణయాలు.. డబ్ల్యూహెచ్ఓపై ట్రంప్ ఫైర్

trump usa

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)) చైనా పక్షపాతిగా వ్యవహరిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. తాజాగా వాషింగ్టన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

డబ్ల్యూహెచ్ఓకు నిధులను నిలిపివేస్తామని వ్యాఖ్యానించారు. ఐరాసలో భాగంగా ఉన్న డబ్ల్యూహెచ్ఓకు అమెరికా నుంచి అత్యధికంగా నిధులు అందుతూ ఉంటాయన్న సంగతి విదితమే. “వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోసం వెచ్చిస్తున్న నిధులను నిలిపివేస్తాం. నేను కేవలం మాటలు మాత్రమే చెప్పడం లేదు. చేసి చూపిస్తా. నిధుల విడుదలను నిలిపివేయబోతున్నాం” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

అన్ని దేశాలనూ సమానంగా చూడాల్సిన డబ్ల్యూహెచ్ఓ, చైనాకు మాత్రమే అనుకూలంగా ఉందని మండిపడ్డారు. చైనాలో తొలుత వైరస్ వెలుగులోకి వచ్చిన తరువాత, డబ్ల్యూహెచ్ఓ నుంచి వచ్చిన అసత్యపు సిఫార్సుల కారణంగానే, అంతర్జాతీయ ప్రయాణాలు సాగాయని, ముందుగానే హెచ్చరించి వుంటే, ఇంత ఘోర పరిస్థితి ప్రపంచానికి ఎదురయ్యేది కాదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. చైనా నుంచి వచ్చే విమానాలను అనుమతించాలని తన ముందుకు ప్రతిపాదనలు వచ్చాయని, అయితే, తాను అదృష్టవశాత్తూ దాన్ని అంగీకరించలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Related posts