ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో 19 ఏండ్ల బాలిక దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువిరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలిక హత్య ఘటనపై యూపీ సర్కార్ దర్యాప్తు వేగవంతం చేసింది.హత్రాస్ ఘటనపై సీబీఐ విచారణకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.
అంతకుముందు బాలికను హత్య చేసిన సంఘటనలో నిర్లక్ష్యంగా దర్యాప్తు చేసినందుకు ఎస్పీ హత్రాస్ విక్రాంత్ వీర్, సీఐ రామ్ షాబాద్ సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. బాలిక హత్యోదంతంపై దర్యాప్తు జరిపేందుకు ఉన్నతాధికారులతో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా బాధిత దళిత బాలిక కుటుంబాన్ని హత్రాస్‌లోని బూల్‌గారి గ్రామంలోని వారి ఇంట్లో కలిశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు. బాధిత బాలిక కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని రాహుల్ అన్నారు. హత్రాస్‌లోని కొన్ని ప్రాంతాల్లో సీఆర్‌పీసీ సెక్షన్ 144 ను అమలు చేసిన నేపథ్యంలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.