telugu navyamedia
రాజకీయ

రైతుల ముసుగులో నాటకాలెందుకు?

తెలంగాణ రైతులనుంచి ధాన్యం సేకరించకుండా సర్కారు పెద్దలు నాటకాలాడుతున్నారని కేంద్ర పౌరసరఫరాల మంత్రి పియూష్ గోయల్ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా రైతుల భవిష్యత్‌ కోసం ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు. బాధ్యతగల ప్రజాప్రతినిధులు తెలంగాణ రైతులను గందరగోళ పరుస్తున్నారని పేర్కొన్నారు. ధాన్యం సేకరణ విషయంలో నెలకొన్న పరిస్థితుల్లో ఆయన.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ నేతలతో కలసి మాట్లాడారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రబీ సీజనులో ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. ఉప్పుడు బియ్యాన్ని అదనంగా తీసుకునేందుకు కూడా అంగీకరించామన్నారు. అదనంగా 20లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన ధాన్యాన్ని తెలంగాణ ఇవ్వలేదని గణాంకాలు వెల్లడించారు. నాలుగు సార్లు గడువు కూడా పొడిగించామని తెలిపారు.

పచ్చిమిర్చి ఎంత ఇచ్చినా తీసుకుంటామని ఏడాది క్రితమే చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఒప్పందం ప్రకారం ధాన్యాన్ని సేకరించి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా…. ఆదిశగా పురోగతి లేదన్నారు. కేంద్రంపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు.

ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఉప్పుడు బియ్యం గాకుండా పచ్చిబియ్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే ఎంతైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు.

Related posts