ఉండవల్లిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న ఇంటికి సీఆర్డీఏ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. అది అక్రమ కట్టడం అని తమ పరిశీలనలో తేలిందని, నివాసాన్ని వారం రోజుల్లో ఖాళీ చేయాలనిసీ అధికారులు ఇంటి గోడకు నోటీసులు అంటించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని నోటీసులో పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన నోటీసులను కూడా ప్రస్తుత నోటీసులో సీఆర్డీఏ అధికారులు పేర్కొన్నారు.
గతంలో ఇచ్చిన నోటీసులకు ఇంటి యజమాని లింగమనేని రమేశ్ వివరణ ఇచ్చారని తెలిపారు. అయితే ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని నోటీసులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, స్విమ్మింగ్ పూల్ లను నిర్మించారని తెలిపారు. పోలవరం కట్టడం అంటే తన ఇంటికి నోటీసులు ఇచ్చినంత సులభం కాదని చంద్రబాబు వ్యాఖ్యానించిన కొన్ని గంటల్లోనే మరోసారి నోటీసులు జారీ చేయడం గమనార్హం.