telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

జగన్ కేసులు… టీడీపీ పుంజుకుంటుంది… అంటూ ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

Undavalli Arun kumar

రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అలాగే జగన్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. రాజశేఖర్ రెడ్డి కొడుకుగా జగన్ పై అభిమానం ఉంది అని చెబుతూనే, జగన్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో జగన్ పాలన ఎలా ఉంది అని అడగగా ఇంకా 5 నెలలేగా అయ్యింది అంటూ జగన్ పాలన పై అభిప్రాయం మాత్రం చెప్పలేదు. ఇదే సందర్భంలో జగన్ కేసుల పై చేసిన వ్యాఖ్యలు చూస్తే జగన్ త్వరలోనే మళ్ళీ జైలుకు వెళ్తారు అనే విధంగా మాట్లాడారు. జగన్ కేసుల పై ఏమి జరుగుతుందొ మీ అభిప్రాయం చెప్పండి అని ప్రశ్నించగా… జగన్ కు కష్ట కాలం ఉందని ఉండవల్లి అన్నారు. శశికళ విషయంలో ఏమి జరిగిందో తెలుసు కదా… ఆమె వెంట మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నా సుప్రీం కోర్ట్ కేసును ముందు పెట్టి అప్పటికప్పుడు ఆమెను జైల్లో పెట్టారని, ఇది మోడీ, అమిత్ షా చెయ్యగలిగేది అని అన్నారు. మోడీ, అమిత్ షా తలుచుకుంటే ఏమైనా జరుగుతుందని, వారు ఈ దేశం కోసమే మేము పుట్టాం అని అనుకుంటూ ఉంటారని అన్నారు. జగన్ కేసుల విషయంలో మొన్న మినహాయింపు కోరుతూ జగన్ వేసిన పిటీషన్ పై సిబిఐ వేసిన అఫిడవిట్ చూస్తేనే ఏమి జరుగుతుందో అర్ధం అవుతుందని అన్నారు. ఆ అఫిడవిట్ లో సిబిఐ… జగన్ సాక్ష్యులను ప్రభావితం చేస్తారు అనే చెప్పిన మాట చాలా పవర్ఫుల్ అని, ఇప్పటికిప్పుడు బెయిల్ రద్దు చేసే అవకాశాలు కూడా ఉంటాయని అన్నారు. ఆ అఫిడవిట్ చదివితే సిబిఐ అమిత్ షా కంట్రోల్ లో ఉన్న సంస్థని తెలిసిపోయిందని అన్నారు. ఇక అదే విధంగా తెలుగుదేశం పార్టీ పై చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. 151 సీట్లు జగన్ కు వచ్చినా, వైసీపీ పార్టీ అనేది లేదనే నేను అనుకుంటా అని అన్నారు. ఆ గెలుపు కేవలం జగన్, వైఎస్ఆర్ ఇమేజ్ వల్ల వచ్చిందని, పార్టీ వల్ల కాదని అన్నారు. తెలుగుదేశం పార్టీకి, బలమైన క్యాడర్ ఉందని, పార్టీ పరంగా, టిడిపి ఎప్పటికీ బలంగానే ఉంటుందని, 23 సీట్లు వచ్చినా, 40 శాతం ఓట్లు వచ్చిన విషయం మర్చిపో కూడదు అని అన్నారు. 2004లో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని, కాని అనూహ్యంగా 2014లో అధికారంలోకి వచ్చిన విషయం మర్చిపో కూడదు, వైసీపీ ఇంకా గ్రామస్థాయిలో బలపడలేదని ఉండవల్లి అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు తిరిగి పుంజుకునే అవకాశాలున్నాయని, జగన్ గెలవడం తనకు వ్యక్తిగతంగా ఆనందమే అని, కాని అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చినప్పటికీ స్థానికసంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశాలున్నాయన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. అయితే ఉండవల్లి జగన్ పై అభిమానంతో డైరెక్ట్ గా చెప్పటం లేదని, గ్రౌండ్ లెవెల్ లో జగన్ కు వ్యతిరేకత ఎంతలా ఉందో ఉండవల్లి మాటలను బట్టి అర్ధం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

Related posts