telugu navyamedia
తెలంగాణ వార్తలు

దుండిగల్ లో అనధికార విల్లాలు ..

హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో నివాసస్థావరాలకు డిమాండ్ పెరిగింది. ఈనేపథ్యంలో శివారు గ్రామీణప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చారు. విలాసవంతమైన భవనాలు, విల్లాలు, అపార్టుమెంట్లు నిర్మించి రియల్ ఎస్టేట్ నిర్వాహకులు, నిర్మాణసంస్థలు అందినంత దోచుకుంటున్నారు.

అనధికార లే ఔట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు రకరకాల వెంచర్లతో నివాసస్థావరాలుగా మారిపోయాయి. చెరువులు కబ్జాకు గురయ్యాయి. భూ క్రయవిక్రయాలు తారాస్థాయికి చేరుకోవడంతో అధికారులు ఆలస్యంగా మేల్కొన్నారు. ఆక్రమిత స్థలాలు, కబ్జాచేసిన చెరువు స్థావరాల్లో వెలసిన అక్రమకట్టాలను గుర్తించి వాటిని సీజ్ చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకున్నామని దుండిగల్ మునిసిపల్ కమిషనర్ భోగీశ్వర్లు తెలిపారు.

హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ మునిసిపాలిటీలో అనధికారిక విల్లా నిర్మాణాలపై భారీ అణిచివేతలో, దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన టౌన్ ప్లానింగ్ విభాగం ఇప్పటికే సుమారు వంద విల్లాలను గుర్తించి సీజ్ చేయగా… మరో వారంరోజుల్లో అక్రమ నిర్మాణాలను గుర్తించబోతున్నారు. నిషేధిత బఫర్‌జోన్‌ కత్వ చెరువు, మల్లంపేటలో నిర్మించిన మరో ఎనిమిది విల్లాలను కూల్చివేస్తున్నారు. వాటిలో నాలుగు ఇప్పటికే నేలమట్టం కాగా, మిగిలిన నాలుగు విల్లాల కూల్చివేత ప్రక్రియలో ఉన్నాయి.

ఈ విల్లాల డెవలపర్‌పై మున్సిపల్ అధికారులు క్రిమినల్ కేసులు బుక్ చేశారు. దుండిగల్ మున్సిపల్ కమిషనర్ భోగీశ్వర్లు ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌లోని మల్లంపేటలో శ్రీ లక్ష్మి కన్‌స్ట్రక్షన్స్ చేపట్టిన విల్లాలను గుర్తించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న విల్లాలు, నిర్మాణ దిశలో మరికొన్ని ఉన్నాయని మునిసిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు. దీంతో దుండిగల్ పరిసరాల్లో నిర్మాణాలు చేపట్టిన ఇన్ ఫ్రా సంస్థల నిర్వాహకుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు సెంట్లు, ఆరు విల్లాలుగా విలసిల్లాయి. అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝుళిపించడంతో ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తొందనే భయం ఇన్ ఫ్రాసంస్థల నిర్వాహకులను పీడిస్తోంది.

కోట్లకు కోట్లు ఆర్జించిన నిర్వాహకులు

నివాస స్థావరాలను కట్టుకోడానికి స్థలం దొరకని నేపథ్యంలో ఎంచక్కా ఇళ్లన కట్టిస్తున్నారని వ్యాపారులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇబ్బడిముబ్బడిగా ఫ్లాట్లను, విల్లాలను కొనుగోలుచేశారు. అడ్వాన్సు బుకింగ్ కోసం వందలాదిమంది కోట్లకు కోట్లు అడ్వాన్సు రూపంలో చెల్లించారు. అడ్వాన్సు చెల్లించిన వారిపరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, నిర్మాణరంగ సంస్థ నిర్వాహకులు మాత్రం లావాదేవీలతో కోట్లకు కోట్లు ఆర్జించారని తెలుస్తోంది. లేఅవుట్ వివరాలను సరిచూసుకోకుండా, సంబంధిత అధికారుల నుంచి అనుమతి ఉందో లేదో చూసుకోకుండానే కొందరు వ్యక్తులు ముందస్తు చెల్లింపులు చేసి కొన్ని విల్లాలను బుక్ చేసుకున్నట్లు తెలిసింది. 1,500-2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఒక్కో విల్లా మార్కెట్ విలువ దాదాపు రూ.1.25 కోట్ల నుంచి రూ.1.50 కోట్లు. అనధికారిక నిర్మాణాలను నిషేధించే తెలంగాణ మునిసిపాలిటీల చట్టం, 2019లోని సెక్షన్ 181(1) ప్రకారం విల్లాలను సీజ్ చేస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఎస్ హరీశ్ ఆదేశాల మేరకు అనధికార భవనాలను గుర్తించి మునిసిపల్ అధికారులు సీజ్ చేశారు.

బఫర్ జోన్‌లో విల్లాలు

కత్వ చెరువులోని ఫుల్ ట్యాంక్ లెవల్/బఫర్ జోన్‌లో నిర్మిస్తున్న ఎనిమిది అక్రమ విల్లాలను హైదరాబాద్‌లోని ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ (ICAD) విభాగం గుర్తించింది. తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (DTCP) లేదా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) నుండి వాటి లేఅవుట్‌లకు అవసరమైన అనుమతి లేదా భవన నిర్మాణ అనుమతులు పొందకుండానే ఈ విల్లాల డెవలపర్ వాటిని నిర్మిస్తున్నారని కమిషనర్ భోగీశ్వర్లు తెలిపారు. గ్రామపంచాయతీ కార్యాలయం ఇచ్చిన అనుమతి ఆధారంగా డెవలపర్ నిర్మాణాలు చేపట్టారు. నిర్మాణాల మంజూరుకు పంచాయతీ కార్యదర్శికి మెమో జారీ చేశామని కమిషనర్ తెలిపారు. పంచాయతి కార్యదర్శికి ఇంటినిర్మాణాలకు సంబంధించి అనుమతిచ్చే అధికారం లేదని కమిషనర్ భోగీశ్వర్లు తెలిపారు. మల్లంపేటలో శ్రీ లక్ష్మి కన్‌స్ట్రక్షన్స్ చేపట్టిన విల్లాల్లో అన్ని అనుమతులు సక్రమంగా ఉన్నవాటి జోలికెళ్లకుండా… నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణలను గుర్తించి జిల్లా కలెక్టర్ ఆదేశాలను అనుసరించి సీజ్ చేశామని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న విల్లా నిర్మాణాలపై డీటీసీపీ, హెచ్‌ఎండీఏ అధికారులు జిల్లా కలెక్టర్‌ కు నివేదికను సమర్పించి, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

Related posts