telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఇమ్రాన్ పదవి కాలంలో .. మైనారిటీలపై దాడులు ఎక్కువ అయ్యాయి.. : ఐక్యరాజ్యసమితి

Pak people attack pak poilet

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై మరోసారి ఐక్యరాజ్యసమితి(యూన్) కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ తన దేశంలోని మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్న విషయాన్ని మాత్రం గుర్తించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్యసమితి ఆ దేశంపై మండిపడింది. మనదేశ వ్యవహారాల్లో తలదూరుస్తున్న ఇమ్రాన్ ఖాన్.. తన దేశంలో పరిస్థితిని మాత్రం చక్కబెట్టుకోవడం లేదు. ఆర్టికల్ 370, 35ఏ, పౌరసత్వ సవరణ చట్టంపై ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ భారత ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే, పాకిస్థాన్‌లో మైనార్టీలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలపై మాత్రం ఇమ్రాన్ స్పందించడం లేదు. ఈ విషయంలో పాకిస్థాన్ వైఖరిని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక ఆ దేశ తీరును ఎండగట్టింది. ఐక్యరాజ్యసమితిలోని కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ వుమెన్ అనే విభాగం డిసెంబర్‌లో వెలువరించిన నివేదికలో పాకిస్థాన్‌లోని మైనార్టీల పరిస్థితిని ప్రపంచం ముందు పెట్టింది.

2017 నుంచి మతపరమైన మైనార్టీల పిల్లలను ఇంటర్వ్యూ చేసి రూపొందించిన 47 పేజీల నివేదికలో పాకిస్థాన్‌లోని హిందువులు, క్రిస్టియన్లు, అహ్మదీయులపై జరుగుతున్న హింసను కమిషన్ ప్రస్తావించింది. వీరిని ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తున్నారని, బలవంతపు మత మార్పిడులు, బాల్య వివాహాలు, యువతుల అపహరణ వంటివి యధేచ్చగా కొనసాగుతున్నాయని నివేదిక వెల్లడించింది. అంతేగాక, వాటిని నిరోధించడంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొంది. మైనార్టీలపై మతపరమైన దాడులు చేసేందుకు వివక్షతో కూడిన చట్టాలు రూపొందించి, తీవ్రవాద మనస్తత్వం ఉన్న వ్యక్తులకు ప్రభుత్వం అధికారమిచ్చిందని నివేదికలో కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీ సంవత్సరం వందల సంఖ్యలో బాలికలను ఎత్తుకెళ్లి బలవంతపు మతమార్పిడులు చేయడం, ముస్లిం వ్యక్తులకు ఇచ్చి వివాహాలు చేస్తున్నారని పేర్కొంది. ఇలాంటి ఘటనలపై మైనార్టీలు ఫిర్యాదు చేస్తే.. తీవ్రమైన బెదిరింపులు వస్తున్నాయని, పోలీసులు కూడా అలసత్వం ప్రదర్శిస్తున్నారని, లోపభూయిష్ట న్యాయవ్యవస్థ వల్ల బాధితులకు న్యాయం జరిగే అవకాశం కూడా లేకుండాపోయిందని తెలిపింది.

చాలా సందర్భాల్లో అపహరణకు గురైన మైనార్టీ వర్గాలకు చెందిన యువతులు, బాలికలు తిరిగి వస్తారనే నమ్మకం కూడా వారి కుటుంబాలకు లేకుండా పోయిందని తెలిపింది. అలాగే దైవ దూషణ కేసులు పెరిగిపోవడంపై కమిషన్ ఆందోళ వ్యక్తం చేసింది. ఈ చట్టాన్ని ప్రయోగించి మైనార్టీలను చంపడమో లేక బలవంతపు మతమార్పడి చేయడమో చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనార్టీలు ఆర్థికంగా వెనుబడి ఉండటం, నిరక్షరాస్యత వంటి కారణాలతో మెజార్టీ ప్రజలకు సులువుగా లక్ష్యంగా మారుతున్నారని పేర్కొంది. ముఖ్యంగా సింధ్, పంజాబ్ ప్రావిన్స్‌లో మైనార్టీల పరిస్థితులు ఉందని పేర్కొంది. ఇందుకు ఉదాహరణగా సింధ్ ప్రావిన్స్‌లోని మీర్‌పూర్‌ఖాస్‌లో జరిగిన ఒక ఉదంతాన్ని చూపింది.

హిందూ మతానికి చెందిన వెటర్నరీ డాక్టర్ రమేష్ కుమార్ మల్హి అనే వ్యక్తి ఖురాన్ శ్లోకాలు ఉన్న పేపర్‌లో మందులు చుట్టి ఇచ్చాడని అతని ఆస్పత్రిని నిరసనకారులు ధ్వంసం చేశారు. అంతేగాక, చుట్టుపక్కల ఉన్న హిందువుల వ్యాపారాలు, దుకాణాలను తగలబెట్టారు అని నివేదిక పేర్కొంది. ఇలాంటి దోరణి పాఠశాలల్లో పాకిందని, మైనార్టీ విద్యార్థులను తోటి మెజార్టీ విద్యార్థులు బెదరించడం, అవమానపర్చడం, వేరుగా కూర్చోబెట్టడం వంటివి చేస్తున్నారని వెల్లడించింది. మైనార్టీలు పాకిస్థాన్‌లో శారీరకంగా, మానసికంగా వేధింపులు గురవుతున్నారని పేర్కొంది. గత మూడు దశాబ్దాలుగా ఉగ్రవాదం పెరగడం, చట్టాల దుర్వినియోగం, తప్పుడు కేసుల వల్ల మతహింస పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. మైనార్టీలపై జరుగుతున్న దాడులను అడ్డుకునేందుకు ప్రయత్నించే మానవ హక్కుల సంఘాల సభ్యులకు కూడా బెదిరింపులు వస్తున్నాయని, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు దిగుతున్నారని పేర్కొంది. ఇమ్రాన్ ఖాన్ సర్కారు ఇప్పటికైనా మైనార్టీలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలను అరికట్టేందుకు కఠినమైన చట్టాలను చేయంతోపాటు అమలు చేయాలని యూఎన్ కమిషన్ స్పష్టం చేసింది.

Related posts