telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఐక్యరాజ్యసమితి : … కొత్త సంవత్సరం తొలినాళ్లే … ఉద్రిక్తత వాతావరణం ..

UN chief secretary on america-iran issue

కొత్త సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా చెలరేగుతున్న సంక్షోభాలతో ప్రారంభమైందని, ప్రస్తుతం మనం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో నివశిస్తున్నామని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇరాన్‌ సైన్యాధికారి ఖాసిం సొలేమానీ హత్యానంతరం అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ, ప్రపంచంలో ఈశతాబ్దిలోనే అత్యధిక స్థాయిలో ఘర్షణలు చెలరేగుతున్నాయన్నారు. అణు వ్యాప్తి నిరోధం ఎంతోకాలం నిలవదని ఆయన హెచ్చరించారు. ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు విస్తరిస్తున్న ప్రస్తుత సమయంలో అనేక దేశాలు అనూహ్య పరిణామాలను ఎదుర్కొంటున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఉద్రిక్తతలతో పాటు ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న వాణిజ్య, సాంకేతిక పరమైన వైరుధ్యాలతో వృద్ధి మందగించి, అసమానతలు విస్తరిస్తున్నాయన్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న ఐరాసలో చైనా రాయబారి ఉన్‌ఝంగ్‌ మాట్లాడుతూ ఇరాన్‌ సైన్యాధికారి సొలేమానీ హత్యానంతర పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని, పరిస్థితి అదుపు తప్పకుండా వుండేందుకు తాము ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నామని వివరించారు. ఇరాక్‌లో అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన దాడిపై అమెరికా జారీ చేసిన ప్రకటనను ఆయన ప్రస్తావిస్తూ అమెరికా ఈ ప్రకటనలో చేసిన ఆరోపణలను తాము ఆమోదించటం లేదని చెప్పారు. అంతర్జాతీయ చట్ట నిబంధనల పరిధిలో విదేశీ దౌత్య కార్యాలయ భద్రతను తాము గట్టిగా సమర్ధిస్తామని, అయితే అమెరికా చేపట్టిన సైనిక చర్య ఈ ప్రాంతంలో విపరిణామాలకు దారి తీస్తోందని ఆయన వివరించారు. భద్రతా మండలి తీసుకున్న చర్య తాజా పరిణామాల పరిస్థితిని ప్రతిబింబిస్తోందని, ఉద్రిక్తతల సడలింపునకు సహకరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Related posts