telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ నుండి తప్పుకున్న ఇద్దరు అంపైర్లు….

ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆండ్రూ టై, కేన్‌ రిచర్డ్‌సన్‌, ఆడమ్‌ జంపా.. ఇంగ్లండ్ ప్లేయర్ లియామ్ లివింగ్‌స్టోన్, టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ 2021 నుంచి అర్థాంతరంగా తప్పుకున్నారు. ఇప్పుడు వీరి సరసన ఇద్దరు అంపైర్లు కూడా చేరారు. భారత్‌కు చెందిన అంపైర్‌ నితిన్‌ మీనన్‌తో పాటు ఆస్ట్రేలియాకు చెందిన పాల్‌ రీఫెల్‌ టోర్నీ నుంచి నిష్క్రమించారు. నితిన్‌ మీనన్‌, పాల్‌ రీఫెల్‌ ఇద్దరూ కూడా ఐసీసీ ఎలైట్‌ ప్యానల్‌ సభ్యులు. కరోనా మహమ్మారి కారణంగానే ఐపీఎల్‌ నుంచి తాము తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నితిన్ మీనన్‌ తల్లికి, భార్యకు కరోనా పాజిటివ్‌ రావడంతో వారితో ఉండటం కోసం అతను టోర్నీ నుంచి వైదొలిగారు. ఇక రీఫెల్‌ మాత్రం ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న విమానా రాకపోకల నిషేధం కారణంగా స్వదేశం వెళ్లిపోవడానికి సిద్దమయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు కూడా ధ్రువీకరించారు. అయితే టోర్నీ నుంచి ఒక్కక్కరు తప్పుకోవడంతో బీసీసీఐ ఆందోళనలో ఉందని సమాచారం. ‘నితిన్‌ మీనన్‌కు చిన్న కుమారుడు ఉన్నాడు. తల్లికి భార్యకు కరోనా సోకడంతో కుమారుడిని చూసుకోవడానికి ఐపీఎల్‌ 2021ను వీడాల్సి వస్తుంది. ఇక పాల్‌ రీఫెల్‌ భయపడుతున్నారు. ఐపీఎల్‌ 14వ సీజన్ ముగిసిన తర్వాత స్వదేశానికి వెళ్లడానికి విమాన సౌకర్యం ఉండదనే భయంతో ముందుగా వెళ్లిపోతున్నారు. వారి నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. అయితే టోర్నీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. భారత్‌లో చాలామంది స్థానిక అంపైర్లు బ్యాకప్‌ గా ఉన్నారు. వారు అంపైరింగ్‌ సేవల్ని ఉపయోగించుకుంటాం’ అని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

Related posts